Birdflu Virus: బర్డ్‌ఫ్లూ డేంజరేనా? చికెన్ తినొచ్చా?
బర్డ్‌ఫ్లూతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. ఈ వైరస్ సోకిన ప్రాంతాల్లో కోళ్ల ఫారాలను మూసివేస్తున్నారు. దీంతో చికెన్ అమ్మకాలు తగ్గాయి. అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తోంది? ఇది మనుషులకు కూడా వస్తోందా? బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల మాంసం, గుడ్లు తింటే ప్రమాదమా? వైద్యులు ఏం చెబుతున్నారు? ప్రపంచ ఆరోగ్య నివేదిక ఏం చెబుతోంది? ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ తో కోళ్లు మరణించాయి. ఫిబ్రవరి తొలి వారంలో కోళ్ల ఫారాల్లో పెద్ద ఎత్తున కోళ్లు మరణించాయి. ఈ జిల్లాల నుంచి కృష్ణా జిల్లాకు కూడా ఈ వైరస్ పోకింది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని భోపాల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజస్ ఐసీఏఆర్- ఎన్ఐ హెచ్ఎస్ ఏడీ నివేదిక తేల్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్టైంది.
వైరస్ సోకిన కోళ్లను మీటర్ల లోతు గోతులు తవ్వి పూడ్చి పెట్టారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బర్డ్ ఫ్లూ పై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో 10 కోట్ల కోళ్లు ఉంటే బర్డ్ ఫ్లూ తో 5.42 లక్షల కోళ్లు మరణించినట్టు ఏపీ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో అధికారులు ఏమంటున్నారు?
ఇక తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని పలు పౌల్ట్రి ఫారాల్లో కోళ్లు మరణించాయి. కామారెడ్డితో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో కూడా వేలాది కోళ్లు మరణించాయి. వనపర్తి జిల్లాలో కూడా వందలాది కోళ్లు మరణించాయి.
బర్డ్ ఫ్లూ కారణంగానే ఈ కోళ్లు మరణించినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను పశు సంవర్ధక శాఖ అధికారులు టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపారు. ఈ రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు రిపోర్టు కాలేదని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ఫిబ్రవరి 21న ప్రకటించారు. అయితే చనిపోయిన కోళ్లకు సంబంధించిన రిపోర్టులు వస్తే కానీ కోళ్ల మరణానికి కారణాలు తెలుస్తాయి. తెలంగాణలో 6 వేల పౌల్ట్రి ఫారాలున్నాయి. ఇందులో 90 మిలియన్ కోళ్లున్నాయి. ఇదెలా ఉంటే2015లో తెలంగాణలో బర్డ్ ఫ్లూ పెద్ద ఎత్తున వ్యాపించింది. లక్షకు పైగా కోళ్లు మరణించాయి. అప్పటి నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ అంత పెద్దగా వ్యాపించినట్టు రికార్డులు లేవు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ
బర్డ్ ఫ్లూ అంటే ఏంటి?
బర్డ్‌ఫ్లూ వ్యాధికి హెచ్ 5 ఎన్ 1అనే వైరస్ కారణం. ఇది అంటు వ్యాధి. పక్షులు, జంతువులు, మనుషులకు కూడా ఇది వ్యాపిస్తోంది. 1996లో హెచ్ 5 ఎన్ వైరస్ ను చైనా గుర్తించింది. ఆసియా, యూరప్ దేశాల్లో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. లాలాజలం, పక్షుల రెట్టలు, కలుషిత ఆహారం, నీటి ద్వారా ఇది వ్యాప్తిస్తోంది. ఈ వైరస సోకిన పక్షులు, జంతువులతో ఎక్కువ సమయం ఉన్న మనుషులకు కూడా ఇది సోకే ఛాన్స్ ఉంది.
బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల మాంసం, గుడ్లు తినొచ్చా?
బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల మాంసం, కోడి గుడ్లు తినాలా? వద్దా ? అనేది ప్రస్తుతం అందరిని వేధిస్తున్న ప్రశ్న. ఈ వైరస్ సోకిన కోళ్ల మాంసం తింటే మనుషులకు ప్రమాదమనే వాదన కూడా ఉంది. అయితే ఈ కోళ్ల మాంసం లేదా కోడి గుడ్లను బాగా ఉడికించి తింటే ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఈ వైరస్ బతకదు. ఇండియాలో మాంసాన్ని బాగా ఉడికించి తింటారు. సాధారణంగా మాంసాన్ని 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య వేడి చేస్తారు. ఇలా వండిన చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదని
డాక్టర్ జెల్లా రామదాసు చెప్పారు. కూరగాయాలు, మాంసం వంటి వాటిని ఉడికించే సమయంలో అందులో ఉన్న బ్యాక్టీరియా లేదా వైరస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నశించిపోతుందని ఆయన అన్నారు. సరిగా ఉడికించక దీన్ని తింటే ప్రమాదమని ఆయన చెప్పారు. కోడిగుడ్లను కూడా బాగా ఉడికించిన తర్వాతే తినాలని డాక్టర్ సూచించారు.
బర్డ్ ఫ్లూ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఏం చెబుతోంది?
ప్రపంచంలోని పలు దేశాల్లో బర్డ్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. 2021 నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగేళ్లలో 28 పౌల్ట్రి వర్కర్లు ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ 28 మందిలో ఇండియాలోని హర్యానాకు చెందిన ఒకరు కూడా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది.
ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎవరికి సోకలేదు. తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ ఎక్కువగా ఉంది. బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్ల ద్వారా మనుషులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఇక్కడే ఉందని ఈ నివేదిక చెబుతోంది. పక్షులు, జంతువుల ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతోంది. ఈ వైరస్ సోకిన మనుషులు ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకొంటే ఇతరులకు వ్యాపించదు. అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. దీంతో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. బర్డ్ ఫ్లూ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం చాలా తక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వలస పక్షులతో బర్డ్ ఫ్లూ
వలస పక్షులతోనే బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది. వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే వైరస్ వాటి రెట్టల ద్వారా జలాశయాల్లో చేరుతోంది. ఇది నీరు, ఇతర మార్గాల ద్వారా కోళ్లకు వస్తోంది. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏపీలోని పలు ప్రాంతాలకు వలస పక్షులు వస్తుంటాయి.
పౌల్ట్రి రంగంపై ప్రభావం ఎంత?
బర్డ్ ఫ్లూ వైరస్ పౌల్ట్రి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బర్డ్ ఫ్లూ సోకకముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో లైవ్ కోడి ధర 180 గా ఉండింది. అయితే బర్డ్ ఫ్లూ ప్రభావంతో ఇప్పుడు అది 90 రూపాయాలకు పడిపోయింది. ఇక కోడిగుడ్ల ధరలు పడిపోయాయి. గతంలో ఒక్క గుడ్డు ఐదు రూపాయాలకు పైగా ధర పలికింది. ప్రస్తుతం ఒక్క గుడ్డు ధర మూడున్నర రూపాయాలకు పడిపోయింది. తెలంగాణలో ప్రతిరోజూ 10 లక్షల రూపాయాల విలువైన చికెన్ అమ్మకాలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంతకంటే కొంచెం ఎక్కువగా చికెన్ విక్రయాలుంటాయనేది అంచనా. అయితే బర్డ్ ఫ్లూ ప్రభావంతో అమ్మకాలు తగ్గాయి. లక్షల సంఖ్యలో కోళ్లు మరణించడంతో పౌల్ట్రి రైతులకు తీవ్ర నష్టమే జరిగింది. కోడి పిల్లలు ఎదగడానికి కనీసం 45రోజులు పడుతోంది. అంటే రానున్న రోజుల్లో చికెన్ రేటు పెరిగే అవకాశం ఉంది. బర్డ్ ఫ్లూ భయంతో నాన్ వెజ్ ప్రియులు మటన్, ఫిష్ వైపు మళ్లుతున్నారు. దీంతో మటన్, ఫిష్ ధరలు మండిపోతున్నాయి.
బర్డ్ ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ లేదు. అయితే దీనికి సంబంధించి నివారణే మార్గం. పౌల్ట్రి రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలి. వలస పక్షులు వచ్చే ప్రాంతాల్లో కోళ్లకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వైరస్ తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.