జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు... సభ్యత్వం రద్దు చేస్తారా? అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది?
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు... సభ్యత్వం రద్దు చేస్తారా? అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది?
Telangana Budget Sessions 2025: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ సస్పెన్షన్ ను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.
తెలంగాణ అసెంబ్లీలో రగడకు కారణం ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేసింది? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగింది? గులాబీ పార్టీ వాదన ఏంటి? అధికార పార్టీ కౌంటర్ ఏంటో ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరిలో తెలుసుకుందాం.
అసలు ఏం జరిగింది?
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మార్చి 13న జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. జగదీశ్ రెడ్డి తన ప్రసంగంలో రైతుల గురించి ప్రస్తావించారు. ఈ విషయమై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటరిచ్చారు. అయితే ఈ సమయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం సభను నడపాలని స్పీకర్ ను తలసాని కోరారు. ఆ తర్వాత జగదీశ్ రెడ్డిని మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలని సూచించారు. మీ వ్యాఖ్యలపై కూడా తాను స్పందిస్తానని జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలే సభలో గందరగోళానికి నాంది పలికాయి.
జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. స్పీకర్ ను బెదిరించే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.
గవర్నర్ ప్రసంగంపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ జగదీశ్ రెడ్డిని కోరారు. సహనంతో మాట్లాడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
ఈ సభ అందరిది... అందరికీ సమానమైన హక్కులుంటాయి.తమ అందరి తరపున మీరు పెద్దమనిషిగా కూర్చొన్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. అంతేకాదు ఈ సభ మీ స్వంతం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి.
దీంతో అసెంబ్లీ వాయిదా వేశారు స్పీకర్. అసెంబ్లీ తిరిగి సమావేశమైన తర్వాత జగదీశ్ రెడ్డి శాసనసభ సభ్వత్వం రద్దు చేయాలని అధికారపక్షం కోరింది. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై చర్యలను ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కోరారు. స్పీకర్ ను కించపర్చేలా వ్యాఖ్యానించినందుకు ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రతిపాదించారు. దీంతో జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఎథిక్స్ కమిటీకి ఉన్న అధికారాలు ఏంటి?
సభలో ఎవరైనా సభ్యులు సభ నియమావళికి విరుద్దంగా వ్యవహరిస్తే వారిపై చర్యలకు ఎథిక్స్ కమిటీ సిఫారసు చేస్తోంది.సాధారణంగా తొమ్మిదిమంది ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఎన్ని రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలో కూడా స్పీకర్ ఆదేశిస్తారు. ఈ కమిటీ జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై రిపోర్టును స్పీకర్ కు అందించనుంది. ఈ రిపోర్టును అసెంబ్లీలో చర్చిస్తారు.
గతంలో ఏం జరిగింది?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను రద్దు చేశారు. 2018 మార్చి 12న గవర్నర్ ప్రసంగ సమయంలో తమ చేతిలోని హెడ్ ఫోన్ విసరడంతో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కన్నుకు గాయమైందని అప్పట్లో అధికార పార్టీ ఆరోపించింది. ఈ అంశాన్ని చూపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ఎమ్మెల్యే సభ్యత్వాలను రద్దు చేశారు. దీనిపై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అప్పట్లో కోర్టును కూడా ఆశ్రయించారు.
శాసనసభ సభ్యత్వం పోతుందా?
జగదీశ్ రెడ్డి స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం మండిపడుతోంది. స్పీకర్ గా మీరు మా అందరి తరపున పెద్దమనిషి మాత్రమే... ఈ సభ మీ స్వంతం కూడా కాదంటూ జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అసెంబ్లీ రూల్స్ కు విరుద్దంగా ఉన్నాయని అధికార పార్టీ సభ్యులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ ఇచ్చే సిఫారసు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.
బీఆర్ఎస్ వాదన ఏంటి?
జగదీశ్ రెడ్డిని ఒక సెషన్ సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. స్పీకర్ పట్ల అగౌరవంగా మాట్లాడలేదని కారు పార్టీ నాయకులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా మాట్లాడకపోయినా సస్పెండ్ చేశారని గులాబీ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. అయితే స్పీకర్ ను అవమానించేలా వ్యాఖ్యానించినందుకే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని హస్తం పార్టీ చెబుతోంది.
కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసిన అంశాలను అధికార పార్టీ ప్రస్తుతం తెరమీదికి తెస్తోంది. జగదీశ్ రెడ్డి అంశంపై రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.