Telangana Congress: గాంధీభవన్ కుర్చీ ఎవరికి?

Telangana Congress: తెలంగాణ పీసీసీ చీఫ్‌కగా సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది.

Update: 2024-06-14 12:45 GMT

Telangana Congress: గాంధీభవన్ కుర్చీ ఎవరికి?

Telangana Congress: తెలంగాణ పీసీసీ చీఫ్‌కగా సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దాంతో, ఈ పదవి కోసం కాంగ్రెస్ నాయకుల పోటీ జోరందుకుంది. దిల్లీ దర్బారులో లాబీయింగ్ మొదలైంది. ఈ రేసులో ముందున్న నేతలెవరు? ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి... ఓటమి పాలయిన నేతలకు చాన్స్ లేనట్లేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? తన కోటరీ నేతల పేర్లనే అధిష్ఠానానికి ఈపాటికే సిఫార్సు చేశారా?

గాంధీభవన్ కుర్చీ ఎవరికి?

తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవిపై గాంధీభవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. దీంతో పీసీసీ చీఫ్ పదవిని కొత్త వారికి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ హైకమాండ్. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. జోడు పదవుల్లో కొనసాగేందుకు ఆయన కూడా ఇష్టపడటం లేదు. ఈ నెలాఖరుతో పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కొత్త అధ్యక్షుడి నియామకం ఫోకస్ చేసింది. ఇప్పటికే ఒకరిద్దరు సీనియర్స్‌ లీడర్స్‌ని సంప్రదించినట్టు తెలుస్తోంది. పదవుల పంపకంలో సామాజిక సమతుల్యం పాటించాలని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు రెడ్డి సామాజికవర్గానికే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని...ముఖ్యమంత్రి పదవిలో వారే ఉన్నారని అంటున్నారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కచ్చితంగా సామాజిక న్యాయం పాటించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

పీసీసీ చీఫ్ పదవికి బీసీలకే ఇవ్వాలని పలువురు నేతలు పార్టీపై ఒత్తిడి చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి పార్టీ పగ్గాలు అప్పగించాల్సి వస్తే పీసీసీ వర్కింగ్, ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ముందు వరసలో ఉన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ పార్టీనేతలందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. గడిచిన మూడేళ్లుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఎవరితో ఇబ్బందులు లేకుండా అందర్ని సమన్వయం చేసుకొని...ముందుకు వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లడంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు మాజీ ఎంపీ మధుయాష్కి రేసులో ఉన్నా... అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ టికెట్లు ఇచ్చిన వారికి పార్టీ పదవులు ఉండవన్న చర్చ పార్టీలో నడుస్తోంది.

బీసీలకు ఇవ్వని పక్షంలో మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని... ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరూ మాల సామాజికవర్గానికి చెందిన వారేనని అంటున్నారు. మంత్రివర్గంలోనూ దామోదర రాజనర్సింహకు మాత్రమే అవకాశం ఇచ్చారని కూడా గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మాలలకు సీట్లు ఎక్కువ ఇచ్చినందున, పీసీసీ పదవిని మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇదే అంశాన్ని కొంతమంది సీనియర్ నేతలు కూడా పార్టీ హైకమాండ్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సంపత్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం.

పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుమార్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి... పీసీసీ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీ పెద్దల వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి రేణుకా చౌదరి, బీసీల్లో అనిల్ కుమార్ ను రాజ్యసభకు పంపినందుకు పీసీసీ చీఫ్ ఛాన్స్ తనకు ఇవ్వాలని జగ్గారెడ్డి చెప్పినట్లు సమాచారం. అయితే, ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పీసీసీ చీఫ్ పదవి బీసీలకు దక్కుతుందా, లేక మాదిగ సామాజిక వర్గానికి కట్టబెడతారా... ఇవేవీ కాకుండా మళ్ళీ ఓసీలనే గాంధీ భవన్ కుర్చీలో కూర్చోబెడతారా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News