తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కూరగాయల ధరలు.. టమాట..మోత మోగిస్తోంది.. మిర్చి ఘాటెక్కుతోంది
Vegetables Price Hike: వారం రోజుల వ్యవధిలోనే ధరలు రెట్టింపు
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కూరగాయల ధరలు.. టమాట..మోత మోగిస్తోంది.. మిర్చి ఘాటెక్కుతోంది
Vegetables Price Hike: టమాట..మోత మోగిస్తోంది. మిర్చి ఘాటెక్కుతోంది. మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. అవసరాలకు సరిపడా కూరగాయలు లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు అన్ని రకాల ధరలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
మార్కెట్లో ఏ కూరగాయాలైన కిలో 60 నుంచి 120 వరకూ ఖర్చుచేసి కొనుగోలు చేయాల్సి వస్తోంది. 500 తీసుకెళ్తే ఐదారు రకాల కూరగాయలు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. 10 రకాల కూరగాయలు కొనాలంటే కనీసంగా వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంత ఖర్చుచేసినా వారం రోజులు కూడా ఆ కూరగాయలు సరిపోవడం లేదు. దీంతో సామాన్యులు కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. టమాట సెంచరీ కొట్టగా..కిలో మిర్చి ధర 200లకు చేరువలో ఉంది. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాదు, చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకూ ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా టమాటా, పచ్చిమిర్చి, కాప్సికం, క్యారెట్ సహా ఇతర కూరగాయల రేట్లు భారీగా పెరిగాయి. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణం అనుకూలించని కారణంగా స్థానికంగా కూరగాయల ఉత్పత్తి పడిపోయింది.
ఇక.. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం కర్ణాటకలోని బెల్గాం నుంచి పచ్చిమిర్చి, బెంగళూరు నుంచి టమాట, క్యాప్సికం, క్యారెట్, గుజరాత్ నుంచి ఆలుగడ్డతో పాటు ఇతర కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. అయితే అక్కడా వాతావరణం అనుకూలించక కూరగాయల ఉత్పత్తి దారుణంగా పడిపోవడంతో.. ధరలు పెంచేశారు. ఈ ప్రభావం రాష్ట్రంలోని మార్కెట్లపైనా పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలకు కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లలో అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వాతావరణం అనకూలించకపోతే కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.