VC Sajjanar : సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఇళ్లకు తాళాలు వేస్తే ఇదే చేయండి: సీపీ సజ్జనార్

సంక్రాంతికి ఊరెళ్లే నగరవాసులు ప్రయాణానికి ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. భద్రతపై కీలక హెచ్చరికలు చేశారు.

Update: 2026-01-05 06:20 GMT

VC Sajjanar : సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఇళ్లకు తాళాలు వేస్తే ఇదే చేయండి: సీపీ సజ్జనార్

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఎక్కువ రోజుల పాటు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు తప్పనిసరిగా ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు.

పండుగ సెలవుల సమయంలో నగరంలో ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని గమనించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందని సీపీ హెచ్చరించారు. ప్రయాణానికి ముందే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా బీట్ ఆఫీసర్‌కు సమాచారం అందిస్తే, ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపడతారని స్పష్టం చేశారు.

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకూడదని సజ్జనార్ సూచించారు. వీటిని బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవడం ఉత్తమమని తెలిపారు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పండుగను నిర్భయంగా, ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు.

నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, వాటిని ముందుగానే నివారించడమే ఆధునిక పోలీసింగ్ లక్ష్యమని సీపీ అన్నారు. ప్రజల భద్రతకు హైదరాబాద్ పోలీసులు కట్టుబడి ఉన్నారని, ప్రజల సహకారం కూడా అవసరమని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



Tags:    

Similar News