Nizamabad: పెరిగిన పసుపు ధరలు.. పదిరోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.2,000 పెరిగిన ధర

Turmeric: నిజామాబాద్ మార్కెట్‌లో రూ.9494కు చేరుకున్న క్వింటల్‌ పసుపు

Update: 2023-07-02 10:11 GMT

Turmeric: పెరిగిన పసుపు ధరలు.. పదిరోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.2,000 పెరిగిన ధర

Nizamabad: నిన్న మొన్నటిదాక బిక్కముఖంతో దిగాలు పోయిన పసుపు రైతుల ముఖాలు వెలిగిపోతున్నాయి. మార్కెట్‌లో పసుపు ధరలు ఆల్‌టైం రికార్డును నమోదు చేశాయి. రాష్ట్రంలో పసుపు విక్రయాలకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న నిజామాబాద్ మార్కెట్‌లో క్వింటా పసుపు ధర 9వేల 4వందల 94కు చేరుకుంది. నిజామాబాద్ మార్కెట్‌లో గత పదిరోజుల వ్యవధిలోనే క్వింటాల ధర ఏకంగా రూ.2వేలు పెరిగింది. రానున్న రోజుల్లో పసుపు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు పంటకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ సీజన్‌లో ఫిబ్రవరి నుంచి మే వరకు క్వింటాకు 5 వేల5వందల నుంచి 6 వేల 5వందల మధ్య ధరలు పలికాయి. మార్కెట్లో డిమాండ్‌ లేదని చెబుతూ వ్యాపారులు తక్కువ ధరను కోట్‌ చేయటం చూశాం. కానీ ప్రస్తుతం ఎక్కువ ధర పెట్టేందుకు వ్యాపారులు ముందుకొస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన నల్ల దయన్న 60 సంచుల పంటను నిజామాబాద్‌ యార్డుకు తెచ్చారు. ఈయన పంటకు వ్యాపారులు 9 వేల2వందల 49 ధర చెల్లించారు.

అంకాపూర్‌ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి పసుపును 9వేల4 వందల94 ధరతో కొనుగోలు చేశారు. ఇదే నాణ్యతతో తెచ్చిన పంటను నెల కిందట 6 వేల నుంచి 6వేల5వందల మధ్యే కొనుగోలు చేసిన పరిస్థితిని చూశామని అధికారులు పేర్కొంటున్నారు. స్పైస్‌ బోర్డు ఆధ్వర్యంలో అవగాహన కల్పించినందున కొందరు రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు మంచి ధర పొందుతారని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు. నాణ్యతను బట్టి పసుపు పంటకు మంచి ధర పెట్టేందుకు కొనుగోలు దారులు పోటీలు పడుతున్నారు.

నిజామాబాద్ మార్కెట్‌లో గత పదిరోజుల వ్యవధిలోనే క్వింటాలు ధర ఏకంగా 2వేలు పెరిగింది. రానున్న రోజుల్లో పసుపు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్వింటాలు పసుపు ధర పదివేల మార్క్ దాటే అవకాశం ఉందంటున్నారు. పచ్చబంగారంగా భావించే పసుపు ధరలు పైపైకి పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News