Tsrtc Strike : భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ నేతలు

రోజులు గడుస్తున్నాఆర్టీసీ సమ్మెకు బ్రేక్‌ పడడం లేదు. 16వ రోజూ యధావిధిగా సమ్మె కొనసాగింది. చర్చలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు

Update: 2019-10-20 13:38 GMT

రోజులు గడుస్తున్నాఆర్టీసీ సమ్మెకు బ్రేక్‌ పడడం లేదు. 16వ రోజూ యధావిధిగా సమ్మె కొనసాగింది. చర్చలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 21 నుంచి 30 వరకు వివిధ రూపాల్లో నిరసనలకు ప్లాన్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అందరూ మద్దతిస్తున్నారని, నిరసనకారులపై పోలీసులు అనుసరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని తెలిపారు ఆర్టీసీ జేఏసీ నేతలు.

శనివారం తెలంగాణ బంద్‌ నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ ఆదివారం అఖిలపక్షం నేతలతో సమావేశమై.. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. దీపావళి ముందు రోజు వరకు వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోసారి గవర్నర్‌ను కలిసి సమ్మెపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.

సోమవారం అన్ని డిపోల ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ కార్మికులు నిరసన తెలియజేస్తామని.. 22న తమ పొట్ట కొట్టొద్దంటూ తాత్కాలిక ఉద్యోగులకు విజ్ఞప్తి చేయనున్నారు. 23న అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులతో సమావేశం, ఓయూలో బహిరంగ సభ, 24న మహిళా కండక్టర్ల ర్యాలీ, 25న రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధం, 26న కుటుంబాలతో కలిసి నిరసన ఉంటుందని తెలిపారు. ఈనెల 30న సకల జనుల సమరభేటీ నిర్వహిస్తామని.. అశ్వద్ధామరెడ్డి వివరించారు.

ఇటీవల హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని జేఏసీ నేతలు కోరారు. తమ పొట్ట కొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కోరుతున్నామని చెప్పారు. ఓయూ విద్యార్థులు చేస్తున్న పోరాటాలకు ఆర్టీసీ జేఏసీ మద్దతు ఉంటుందని తెలిపారు. మహిళా పారిశుద్ధ్య కార్మికులు వంద మందిని అరెస్టు చేశారని, పోటు రంగారావుపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని, ఈ దమనకాండను ఆపాలని ముక్త కంఠంతో సూచించారు.

సమ్మెలో భాగంగా సోమవారం నాడు మరోసారి సమావేశం కానుంది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని జేఏసీ కన్వీనర్‌ అశ్వద్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, విజయం సాధించేవరకు పోరాడుదామని అన్నారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News