Godavarikhani: విధి ఆడిన వింత నాటకం.. ఆరు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి!
Godavarikhani: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంటను మృత్యువు విడదీయలేకపోయింది.
Godavarikhani: విధి ఆడిన వింత నాటకం.. ఆరు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి!
Godavarikhani: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంటను మృత్యువు విడదీయలేకపోయింది. ప్రమాదవశాత్తు భర్త గాయపడి మృత్యువుతో పోరాడుతుంటే, ఆ బాధను భరించలేక భార్య నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. అటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త కూడా కన్నుమూయడంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చంద్రుపల్లికి చెందిన కుంబాల నరేశ్(34), గోదావరిఖని జీడీకే-1 గనిలో ట్రామర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను 14 నెలల క్రితం నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత(30)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ గోదావరిఖనిలోని ఉదయ్‌నగర్‌లో నివాసముంటున్నారు.
ప్రమాదం - మనస్తాపం:
ఈ నెల 16న కాళేశ్వరం వెళ్లి వచ్చిన నరేశ్, మరుసటి రోజు ఇంట్లో మెట్లపై నుండి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఇంటి యజమాని మమతకు సమాచారం అందించారు. వెంటనే నరేశ్‌ను కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి నరేశ్ బతికే అవకాశం తక్కువని, ఒకవేళ బతికినా జీవచ్ఛవంలా ఉంటాడని చెప్పారు. ఈ మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత, అదే రోజు రాత్రి కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వేట్రాక్ సమీపంలో ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఆస్పత్రిలో భర్త మృతి:
మరోవైపు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరేశ్ పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. ఆరు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నరేశ్ తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు గోదావరిఖని పోలీసులు కేసు నమోదు చేయగా, మరోవైపు అత్తామామల వేధింపుల వల్లే మమత చనిపోయిందంటూ కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.