Huzurabad: హుజురాబాద్‌లో సోషల్‌ మీడియా వేదికగా రాజకీయ పోరు

Huzurabad: రాజకీయ నేతలు ఎప్పుడో ఏదో సందర్బంలో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో కొంపముంచేలా తయారు అవుతాయి.

Update: 2021-10-01 08:44 GMT

Huzurabad: హుజురాబాద్‌లో సోషల్‌ మీడియా వేదికగా రాజకీయ పోరు

Huzurabad: రాజకీయ నేతలు ఎప్పుడో ఏదో సందర్బంలో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో కొంపముంచేలా తయారు అవుతాయి. అపొజిషన్‌ పార్టీ చేతిలో ఆ వీడియోలు పడితే వారికి గట్టి ప్రచారాస్త్రాలుగా మారుతాయి. ఇదే విషయం అనేక సందర్భాల్లో నిజం కూడా అయ్యాయి. కొన్ని సమయాల్లో అవి ఫేక్ పోస్టులు అని తెలిసే లోపు జరగాల్సిన నష్టం జరిగి పోతుంది. ఇప్పుడు హుజురాబాద్ లో కూడా సోషల్ మీడియా వార్ నడుస్తోంది.

బీజేపీ జాతీయ నాయకత్వం అందులోనూ మోడీ టీం సోషల్ మీడియాను గట్టి ప్రచారాస్త్రంగా ప్రయోగిస్తుంది. అందుకు తగిన మంచి పలితాలు పొందింది కూడా. ఇక మన తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ టీఆర్ఎస్ సోషల్ మీడియా వార్ ను చూసాం. అక్కడ బీజేపీ అభ్యర్ది రఘునందన్ రావు అతి తక్కువ ఓట్లతోనైనా గెలిచేలా చేసింది. దీంతో సోషల్ మీడియా దెబ్బను గమనించిన కారు పార్టీ యువనేత కేటీఆర్ గట్టి సోషల్ మీడియా టీం ను ఏర్పాటు చేసారు.

ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల విషయంలో ప్రత్యార్ధుల్ని ఓడించడానికి సోషల్‌ మీడియాను ఉపయోగించి సాహసమే చేస్తున్నారు. ప్రత్యర్ది ఓటర్లను కొల్లగొట్టేలా ఫేకింగ్‌ పోస్టులకే రాజకీయ పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికల్లో మొదటి నుంచి ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత ఈటల రాజేందర్ కేసీఆర్ ను క్షమాపణ కోరినట్లుగా ఓ లేఖ తెరపైకి వచ్చి సంచలనం అయింది. ఆ తర్వాత ఓ సామాజికవర్గాన్ని ఈటల బావమరది అవమానించిట్లుగా వాట్సాప్ స్టేటస్‌లు, ఆడియో టేపులు బయటకు వచ్చాయి.

ఈటల రాజేందర్ తాజాగా దళిత బంధు ఆపాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఓ లేఖను విడుదల చేశారు. సీఎం కేసీఆర్ దళితులను లక్షాధికారులను చేయాలని చూస్తే ఈటల ఓర్వలేకపోతున్నారని, అలాంటి ఈటలను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన దళితులకు పిలుపునిచ్చారు. అయితే గులాభి పార్టీ నుంచి ఆరోపణలను ఈటల రాజేందర్ ఖండించారు. దళితబంధు వద్దు అని నేను రాసినట్టు ఓ అబద్ధపు లేఖ సృష్టించి చిల్లర పనులు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈటల రాజీనామా చేసినప్పటి నుంచి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ తరహా ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పాత వీడియోలతో డబ్బులు కుట్టుమిషన్లు కుంకుమ భరిణెలు ఇతర వస్తువులు పంచుతున్నారని అలాగే, కొంతమంది నేతల్ని గ్రామస్తులు తరిమికొడుతున్నారని పోస్టులు పెడుతున్నారు. ఇక ఆడియోలకయితే లెక్కలేదు. ఇలాంటి దుమారాలతో హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పటికే హీటెక్కిస్తోంది. రానున్న రోజల్లో ఇది మరింతగా పెరిగే పరిస్థితి ఉందటున్నారు.

Tags:    

Similar News