Union Budget 2025: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోర్కెల చిట్టా ఇదీ..!
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులు, పథకాలకు నిధులు కేటాయించాలని తెలుగు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి.
Union Budget 2025: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోర్కెల చిట్టా ఇదీ..!
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులు, పథకాలకు నిధులు కేటాయించాలని తెలుగు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ లో నిధుల కోసం ఏపీ ప్రభుత్వం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. నిర్మలమ్మ బడ్జెట్‌లో తమకు ఎన్ని వందల కోట్లు కేటాయిస్తారని రెండు తెలుగు రాష్ట్రాలు ఆశగా చూస్తున్నాయి.
రూ. 1.63లక్షల కోట్లు కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని రూ. 1.63 లక్షల నిధులు ఇవ్వాలని కోరుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవం వంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతోంది. పెద్దన్న మాదిరిగా రాష్ట్రాభివృద్దికి సహకరించాలని గతంలో రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అవసరమైన నిధులను కోరుతోంది.ఆర్ఆర్ఆర్ కు రూ.34,367 కోట్లు ఇవ్వాలని కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సమర్పించాయి. మరో వైపు హైదరాబాద్ మెట్రో రెండో దశకు రూ.24, 269 కోట్లను కేంద్రాన్ని కోరుతోంది. మూసీ పునరుజ్జీవం కోసం మూసీకి రూ. 14, 100 కోట్లను కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వాలని అభ్యర్ధిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికను జనవరి 26 నుంచి ప్రారంభించారు. ఇక వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రానికి రూ. 1800 కోట్లు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఏం కోరుతోందంటే?
పోలవరం, అమరావతి విషయంలో 2024 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యత ఇచ్చింది.పోలవరం ప్రాజెక్టుకు రూ. 12500 కోట్లను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో కొంత మేరకు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభత్వం లక్ష్యంగా పెట్టుకొంది. నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బులు అవసరం. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. అమరావతి నిర్మాణానికి గత బడ్జెట్ లో రూ. 15 వేల కోట్లను కేటాయించారు. అయితే ఇవన్నీ అప్పులే. దీంతో పనులు వేగంగా నిర్వహించేందుకు ఈ బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. దావోస్ టూర్ నుంచి న్యూదిల్లీకి చేరుకున్న వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు.
ఫిబ్రవరి చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు ఇచ్చే నిధుల ఆధారంగా తమ తమ రాష్ట్రాల్లో బడ్జెట్ పై రెండు రాష్ట్రాలు కసరత్తు చేయనున్నాయి.