Sai Chand: తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ మృతి

Sai Chand: రాత్రి ఫామ్‌హౌస్‌లో గుండెపోటుకు గురైన సాయిచంద్‌

Update: 2023-06-29 01:38 GMT

Sai Chand: తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ మృతి

Sai Chand: ఉద్యమ గానం మూగబోయింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. యువతను చైతన్యపరచిన సాయిచంద్‌ ఇక లేరనే వార్త తెలంగాణలో విషాదాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమకారుడు.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌ హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్‌.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని గాయత్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే సాయిచంద్‌ మృతి చెందినట్టు కేర్ ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు.

1984 సెప్టెంబర్‌ 20న వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్‌ జన్మించారు. ఉస్మానియాలో పీజీ వరకు చదువుకున్న ఆయన.. విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిచిలించారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటిచెప్పారు. 2021, డిసెంబర్‌లో సాయిచంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు.

గాయకుడు సాయిచంద్ మృతి చెందడంతో ఆయన సొంత గ్రామం వనపర్తి జిల్లా అమరచింతలో విషాదచాయలు అలుముకున్నాయి. వెంకట రాములు, మణెమ్మ దంపతులకు 1984 లో జన్మించిన సాయిచంద్ చిన్న తనం నుంచే భావజాలం కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. వెంకట్రాములు, మణెమ్మె దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. అందులో మొదటి వ్యక్తి క్రాంతికుమార్.. ఇతను ఆర్మీలో కొనసాగుతూ అనారోగ్యంతో మృతి చెందాడు. రెండవ కుమారుడైన సాయి చంద్ కూడా గుండెపోటుతో హఠాత్మరణం చెందారు. గత కొన్ని సంవత్సరాల క్రితం తల్లి మణెమ్మ కూడా మృతి చెందింది.. భార్యా, ఇద్దరు కుమారులు, కూడా మృతి చెండడంతో సాయిచంద్ తండ్రి వెంకట్రాములు శోకసంద్రంలో మునిగిపోయారు. జడ్చర్ల పట్టణానికి చెందిన రజిని రెడ్డిని పదేళ్ల క్రితం ప్రేమ విహాహం చేసుకున్న సాయిచంద్ కు ఇద్దరు పిల్లలు కాగా, అందులో ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.

చిన్నవయస్సులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ పలువురు నేతలు పేర్కొన్నారు. సాయిచంద్ మృతికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కేర్ ఆస్పత్రిలో సాయిచంద్ భౌతికకాయానికి మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పారు. సాయిచంద్ మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాత్ర విస్మరించలేనిదని, సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. 

Full View


Tags:    

Similar News