సంక్రాంతికి సెలవులు ఉండవా?

సంక్రాంతి పండగ వొస్తుందంటే చాలు విద్యార్థులు సెలవులు ఎప్పుడిస్తారా అని క్యాలెండర్ తిరగేసి చూస్తుఉంటారు.

Update: 2020-01-02 07:09 GMT
Representational image

సంక్రాంతి పండగ వొస్తుందంటే చాలు విద్యార్థులు సెలవులు ఎప్పుడిస్తారా అని క్యాలెండర్ తిరగేసి చూస్తుఉంటారు. సెలవు రోజుల్లో ఎలా గడపాలా అని ప్లాన్స్ వేసుకుంటారు. కానీ ఈ సారి తెలంగాణ విద్యార్థులకు ఆ లక్ లేనట్టుగానే కనిపిస్తుంది. ఈ ఏడాది ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు సంక్రాంతి సెలవులు ఎక్కువగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదికి గాను తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకూ సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ  ప్రయివేటు విద్యా సంస్థలు పాఠశాలలకు సెలవు ఇవ్వకుండా క్లాసులు నడిపించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. 

గతేడాది దసరాకు ముందు ఆర్టీసీ కార్మికుల చేసిన సమ్మె కారణంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు దసరా సెలవులను పొడిగించారు. దీంతో ఇప్పటివరకూ పూర్తి కావలసిన పాఠ్యాంశాలు పెండింగ్‌లోనే ఉండిపోయాయని పాఠశాల యాజమాన్యాలు తెలుపుతున్నాయి. దీంతో సంక్రాంతికి కచ్చితంగా సెలవులు ఇవ్వాల్సిందేనన్న విద్యాశాఖ ఆదేశాలను ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు  పట్టించుకోన్నట్లుగానే ఉంటున్నాయని సమాచారం. ఈ మేరకు విద్యార్థులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ సెలవు రోజుల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఖచ్చితంగా తరగతులు నిర్వహించే ఆలోచనలో యాజమాన్యాలు ఉన్నట్టు  తెలుస్తోంది. 

ఇక ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రయివేటు పాఠశాలలకు  సెలవులు ప్రకటించాలని, ఇందుకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఇక ఈ సెలవుల గొడవపై ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాల్సిందే. సెలవులు ప్రకటించినా ప్రకటించకపోయినా విద్యార్థులు మాత్రం పరీక్షలు దగ్గరలో ఉన్నందుకు ఖచ్చితంగా పాఠాలను చదవాల్సిందే.

Tags:    

Similar News