Telangana Politics: ప్రజా సమస్యలు పక్కనబెట్టి… బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లోనే?

హైదరాబాద్‌లోనే బీఆర్ఎస్ నేతల తిష్ఠ ప్రతిపక్ష పాత్రకు భిన్నంగా అడుగులు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన కారు పార్టీ

Update: 2025-12-03 05:50 GMT

 Telangana Politics: ప్రజా సమస్యలు పక్కనబెట్టి… బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లోనే?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి రెండేళ్లు పూర్తి కావొస్తుంది. ఇదే టైంలో జిల్లాల్లో గ్రామ పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతోంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు ఇదో సువర్ణ అవకాశం. నియోజకవర్గాల్లో స్థానిక ప్రజా సమస్యలపై సర్కార్‌ను నిలదీసి.. ప్రజల మద్దతు కూడగట్టేందుకు మంచి ఛాన్స్. ఇదే ప్రతిపక్షాల అజెండా. మరి ఈ రోల్‌ను ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీలు ఎలా నిర్వర్తిస్తున్నారు..? నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రజల పక్షాన నిలబడుతున్నారా లేక హైదరాబాద్‌లోనే మకాం వేశారా..? brs నేతలు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ భవన్ కే పరిమితం అవుతున్నారా?


ప్రతిపక్ష బిఆర్ఎస్ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్నీ ప్రశ్నించడానికి ఇదే మంచి అవకాశం. కానీ ప్రతిపక్ష బిఆర్ఎస్ అందుకు భిన్నంగా అడుగులు వేస్తుందన్న చర్చ గులాబీ దళంలో జరుగుతుంది.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వ హామీలపై ప్రజల పక్షాన ప్రశ్నించింది కారు పార్టీ. కానీ గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌ను, తెలంగాణ భవన్‌ను బీఆర్‌ఎస్ నేతలు వదిలి వెళ్ళడం లేదట. ఎక్కువ సమయం నియోజకవర్గంలో ఉండకుండా..పట్నం బాట పడుతున్నారట. ఏదో ఫంక్షన్లకు, మీటింగ్‌లకు తప్పించి.. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వాటిని నియోజకవర్గ ప్రజల మధ్య ఉండి ప్రశ్నించడం లేదట. హైదరాబాద్‌లోని పార్టీ హెడ్ ఆఫీస్‌లోనే ప్రెస్ మీట్‌లకు పరిమితం అవుతున్నారట.


ప్రతిపక్ష పార్టీగా గ్రౌండ్‌లో, ప్రజల మధ్య ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గులాబీ పార్టీకి కలిసివచ్చే అంశం. కానీ అలా చేయకుండా తెలంగాణ భవన్ లేదా పార్టీ ముఖ్య నేతలు ఎక్కడ ఉంటే అక్కడే వాళ్ళ చుట్టూ ఉండడం మాత్రమే చేస్తున్నారట. ముఖ్య నేతల చుట్టూ ఉండడంతో గ్రౌండ్‌లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తుంది. ఎన్నికల టైంలో ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చగా.. ఇంకా కొన్ని వాగ్ధానాలు అమలుకు నోచుకోలేదు. వీటికి తోడు స్థానిక సమస్యలు ఉండనే ఉన్నాయి. పైగా ఇప్పుడు తెలంగాణలో స్థానిక సమరం జరుగుతుంది. ఇలాంటి టైంలో గులాబీ లీడర్లంతా నియోజకవర్గాలను చుట్టేస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టైం. కానీ గులాబీ లీడర్లకు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారట. కాంగ్రెస్ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత బీఆర్‌ఎస్‌కి పాజిటివ్ గా మారుతుందని భావించినా లీడర్స్ ప్రజల మధ్య ఉండక పోవడం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందని బిఆర్ ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు


ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై ప్రజలు కోసం నిలబడితే.. బిఆర్‌ఎస్ వైపు ఉంటారని నేతలు చర్చించుకుంటున్నారు..రీసెంట్ గా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయితే అక్కడకి ఎవరు వెళ్లలేదు. నల్గొండ జిల్లాలో సర్పంచ్‌గా నామినేషన్ వేసిన బీసీ అభ్యర్థిని కిడ్నాప్ జరిగినా బీఆర్‌ఎస్ బీసీ ముఖ్యనేతలు ఎవరు కూడా వెళ్లలేదట. ఇలా వెళ్లకుండా హైదరాబాద్ కే పరిమితం అయితే ఎలా అని బిఆర్ ఎస్ నేతలే ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఉండి ప్రెస్ మీట్ పెట్టడం కాదని ప్రజల వద్దకి వెళ్ళి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడం ద్వారా బిఆర్‌ఎస్‌కి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..


బీఆర్ఎస్ తాజా ఎమ్మెల్యేలు, మాజీల్లో కొంతమంది కనీసం నియోజకవర్గం వైపు కూడా చూడటం లేదట. విద్యార్థుల సమస్యలపై విద్యార్థి విభాగం కూడా సైలెంట్ గా ఉంటుంది. స్థానిక ఎన్నికలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టలేక పోతున్నారట. ఓన్లీ సోషల్ మీడియానే నమ్ముకొని హైద్రాబాద్ కే పరిమితం అయి నియోజకవర్గానికి రాకుండా ఉంటున్నారని చర్చించుకుంటున్నారు. ఇకనైనా నేతల తీరు మారాలని,, నియోజకవర్గంలో ఉంటూ ప్రజల పక్షాన పోరాడాలని సూచిస్తున్నారట.

Tags:    

Similar News