బీసీల చుట్టూ తెలంగాణ రాజకీయం.. సడన్‌గా పార్టీలన్నీ బీసీ నినాదాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నాయి...?
BC Politics: తెలంగాణ ఎన్నికల్లో ప్రయోగించే బీసీ అస్త్రానికున్న పదునెంత..?
బీసీల చుట్టూ తెలంగాణ రాజకీయం.. సడన్‌గా పార్టీలన్నీ బీసీ నినాదాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నాయి...?
BC Politics: గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. స్థానిక రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల దాకా.. సామాజిక సమీకరణం కీ రోల్ ప్లే చేస్తోంది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో అధిక శాతం జనాభా ఉన్న సామాజిక వర్గంపైనే రాజకీయ పార్టీల ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన పార్టీలూ అదే పనిలో పడ్డాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ నేతలంతా బీసీ జపం చేస్తున్నారు. కారు, హస్తం, కమలం పార్టీల్లో బీసీ కార్డు క్లిస్టర్ క్లియర్‌గా కనిపిస్తోంది. ఇతర పార్టీల్లోని బీసీ నాయకులను, ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇంతకీ ఆపరేషన్ బీసీ మంత్రం ఏ మేరకు వర్కవుట్ అవుతుంది?
ఎన్నికలు ఎప్పుడొచ్చినా... తెలంగాణలో అధికారం తమదేనని ధీమాగా చెబుతున్నాయి మూడు పార్టీలు. తెలంగాణలో భవిష్యత్ తమదేనని పదేపదే చెబుతూనే బీసీలను ఆకట్టుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీసీలను టార్గెట్ చేస్తూ, వారిని అట్రాక్ట్ చేస్తూ కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. బీసీ ఓట్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
కాంగ్రెస్ కూడా బీసీ రాగం అందుకుంది. ఇప్పటికే కర్ణాటక ఎన్నికలతో జోష్ పెరిగిందని భావిస్తున్న కాంగ్రెస్ బీసీ కార్డ్ సక్సెస్ ఫుల్‌గా ప్లే చేస్తే.. ఆ సామాజిక వర్గం ఓట్లు ఆకర్షించవచ్చని.. బీసీలను తమ వైపు తిప్పుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మరింత ఈజీ అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని.. వారికి జనాభా ప్రకారంగా టికెట్లు ఇవ్వాలంటోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ స్థానాల టికెట్లు బీసీలకు దక్కేలా అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
అటు కమలం పార్టీ కూడా కొన్నాళ్లుగా బీసీ మంత్రం జపిస్తోంది. బీసీలకు సముచిత స్థానం కల్పించాలంటే అది బీజేపీతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉంది ఆ పార్టీ. బీసీ నాయకుడిని దేశ ప్రధానిగా చేసింది బీజేపీనే అని.. ఓబీసీ జాతీయ కమిషన్ బిల్లును ఆమోదింపజేసింది బీజీపీ ప్రభుత్వమని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే విషయాన్ని కూడా ఇటీవల ప్రకటించింది కమలం పార్టీ. రాష్ట్రంలో బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని.. బీసీ జనాభా ఆధారంగా వారి సంక్షేమం కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తామని తెలిపింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని ప్రకటించింది.
ప్రతిపక్షాలు బీసీ మంత్రం జపిస్తుండటంతో.. అధికార పార్టీ కూడా బీసీ ఓటుబ్యాంకుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కారు పార్టీ బీసీలకు ఆర్థిక సాయం ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా కులవృత్తులు చేసుకునే బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. గతంలోనూ గొర్రెల పంపిణీ, కులవృత్తులకు ఉచిత కరెంట్ లాంటి పలు కార్యక్రమాలు చేసిన అధికార పార్టీ ఇప్పుడు బీసీ బంధుతో ఓటర్లను ఆకర్షించి.. ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్‌లోని బీసీ నేతలు ఇవాళ సమావేశమయ్యారు. బీసీలను ఏకం చేస్తామని ప్రకటించారు. బీసీల బాధలు తమ పార్టీకి మాత్రమే తెలుసని.. వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామని మంత్రి తలసాని అన్నారు.
ఇలా ప్రధాన పార్టీలన్నీ బీసీ కార్డు ప్లే చేయడం వెనుక కారణాలేంటి..? సడన్‌గా పార్టీలన్నీ బీసీ నినాదాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నాయి...? తెలంగాణ ఎన్నికల్లో ప్రయోగించే బీసీ అస్త్రానికున్న పదునెంత?... తెలంగాణలో అరవై శాతం పైగా బీసీ ఓటర్లున్నారు. అయితే వీరికి రాజకీయ పదవుల్లో సముచిత స్థానం దక్కడం లేదని విపక్షాలు.. వారికి మేం మాత్రమే న్యాయం చేస్తామని అధికార పార్టీ చెబుతోంది. తెలంగాణలో అధిక శాతం ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని ఆకర్షిస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం నల్లేరు మీద నడకే. అందుకే ఇప్పుడు పార్టీలన్నీ బీసీ వర్గంపై స్పెషల్ ఫోకస్ పెంచాయి.