Pharma Hub in Hyderabad: వరల్డ్ ఫార్మా హబ్ గా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

Pharma Hub in Hyderabad: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.

Update: 2020-07-28 14:00 GMT
KTR

Pharma Hub in Hyderabad: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫార్మా రంగం తన బలాన్ని మరోసారి చాటుకుంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని మొత్తం వ్యాక్సిన్లలో సుమారు 30 శాతానికి పైగా హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి కావడం తెలంగాణకే గర్వకారణం అంటూ నగరంలోని ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం ప్రాధాన్యత, భవిష్యత్ దిశానిర్ధేశం పైన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం జినొమ్ వ్యాలీ, దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్ అని ఆయన తెలిపారు. ఫార్మాసిటీ వంటి ప్రాజెక్టులతో ప్రపంచంలోనే ఒక అగ్రగామి ఫార్మా డెస్టినేషన్ గా నిలదొక్కుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ అని ఆయన వెల్లడించారు.

ఫార్మా , లైఫ్ సైన్సెస్ అవకాశాలు భవిష్యత్తులో మరింతగా పెరిగే పరిస్థితులు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ లాంటి కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందు వరుసలో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కేవలం మందుల తయారీ మాత్రమే కాకుండా భవిష్యత్తులో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం కారోనా సంక్షోభంలో మాత్రమే కాకుండా సంక్షోభం తర్వాత సైతం ఈ రంగంలో అనేక అవకాశాలు ఉంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల క్రితం దేశంలో ఐటీ పరిశ్రమలొ లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఒక అద్భుతమైన అవకాశంగా లభించిందన్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు ఫార్మా, లైఫ్ సైన్స్ రంగంలో నెలకొని ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయాన్నిఆయన ప్రస్తావించారు. ఈ రంగంలో అంది వచ్చే భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫార్మా రంగంలో పోటీకి మాత్రమే కాకుండా భాగస్వామ్యాలకు సైతం అనేక అవకాశాలు ఉన్నాయని, ఆ వైపు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తో 'మెడిసిన్స్ ఫ్రం ద స్కై' వంటి కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో చేపట్టి అత్యవసర సమయాల్లో డ్రోన్లతో మందులను సరఫరా చేసి అంశంపైన పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.


 

Tags:    

Similar News