ఆస్పత్రుల్లో మరణించిన వారికి పరీక్షలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని అమలు చేయకపోవడం వల్ల వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారని పేర్కొంది. దీనిని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని హుకుం జారీ చేసింది.
కరోనా కేసులకు సంబంధించి తమ ఆదేశాలు ఏమాత్రం అమలు కావటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడతామంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రుల్లో చనిపోయిన వారికి కరోనా టెస్ట్ చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావటం లేదంటూ కోర్టు మండిపడింది.
ప్రజారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ… ప్రజలకు ఎందుకు ర్యాండమ్ పరీక్షలు చేయటం లేదని మండిపడింది. ప్రజలకు వాస్థవాలు తెలియకపోతే కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక సరిపడ పీపీఈ కిట్స్ అందించలేకపోవటంతోనే కరోనా పై పోరాడుతున్న వైద్య సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారంటూ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ మొత్తం వ్యవహరంలో ఈ నెల 17వరకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ… విచారణను వాయిదా వేసింది.
అయితే దీనిపై సుప్రీం కోర్టులో సవాలు చేశామని, అందుకే అమలు చేయటం లేదంటూ ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. అయితే… సుప్రీంకోర్టు దీనిపై తీర్పు ఇచ్చే వరకు తమ ఆదేశాలు అమలు చేయాల్సిందేనని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది.