Karimnagar Honeytrap: ఇన్‌స్టాగ్రామ్ వల.. అపార్ట్‌మెంట్‌లో హనీట్రాప్: కరీంనగర్ దంపతుల బాగోతం బట్టబయలు..!!
Karimnagar Honeytrap: ఇన్‌స్టాగ్రామ్ వల.. అపార్ట్‌మెంట్‌లో హనీట్రాప్: కరీంనగర్ దంపతుల బాగోతం బట్టబయలు..!!
Karimnagar Honeytrap: వ్యాపారంలో ఎదురైన నష్టాలను పూడ్చుకునేందుకు అడ్డదారిని ఎంచుకున్న ఓ దంపతుల అక్రమ వ్యవహారం చివరికి పోలీసుల చేతిలో బయటపడింది. సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని అమాయక పురుషులను లక్ష్యంగా చేసుకున్న ఈ భార్యాభర్తలు, హనీట్రాప్ పేరుతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ భారీగా డబ్బులు వసూలు చేసినట్టు కరీంనగర్ రూరల్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు గత పదేళ్లుగా కరీంనగర్ రూరల్ పరిధిలోని ఆరెపల్లిలో నివసిస్తున్నారు. భర్త మార్బుల్, ఇంటీరియర్ వ్యాపారం నిర్వహిస్తుండగా, భార్య సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. అయితే వ్యాపారంలో వచ్చిన నష్టాలు, పెరిగిన అప్పులు, ఫ్లాట్ ఈఎంఐలు వీరిని ఆర్థికంగా కుదిపేశాయి. ఈ పరిస్థితుల్లో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఇద్దరూ కలిసి హనీట్రాప్ స్కీమ్‌కు రూపకల్పన చేశారు.
భార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తూ పరిచయాలు పెంచేది. ఆమె మాటల మాయలో పడిన పురుషులను అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించేది. అక్కడ ఆమె బాధితులతో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త దాచిన కెమెరాలతో వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపిస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగేవారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తామని, ప్రాణహాని కూడా చేస్తామని భయపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
గత మూడు సంవత్సరాలుగా ఈ దంపతులు దాదాపు వంద మందికి పైగా వ్యాపారులు, వైద్యులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేసినట్టు విచారణలో తేలింది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఖరీదైన కారు, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారి నుంచి ఇప్పటికే రూ.13 లక్షలు తీసుకున్న ఈ దంపతులు, మరో రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, కారు, నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.