Telangana: తాగు, సాగు నీటిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్.. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశం
Telangana: ఎండాకాలం తాగు నీటిపై అధికారులతో సమీక్ష
Telangana: తాగు, సాగు నీటిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్.. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశం
Telangana: తాగు, సాగు నీటిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎండాకాలం తాగు నీటికి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రానున్నది ఎండాకాలం కాబట్టి.. నీటి అసవరాలకు అనుగుణంగా అత్యవసరం అయితే.. నీళ్ల కోసం KRMBకి లేఖ రాయాలని సూచించారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు, తండాలు, కాలనీలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ తాగు నీరు అందేలా సాగు నీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, శాఖల సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే.. తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగర్ నుంచి ఏపీ 9 TMCలకుపైగా నీరు తీసుకుపోతోందని అధికారులు సమావేశంలో వివరించారు. అంత పెద్ద మొత్తంలో తాగు నీరు ఎక్కడ వినియోగిస్తున్నారని, సరైన గణాంకాలు తీసుకొని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగు నీటికి నీరు తీసుకోవాలంటే KRMBకి లేఖ రాయాల్సి ఉంటుంది. గతంలో ఏప్రిల్ నెలాఖరు, మే నెలలో వచ్చిన వర్షాలతో జూరాలకు నీరు రావడంతో ఇబ్బంది రాలేదని, లేకుంటే నారాయణపూర్ జలాశయం నీరు విడుదల కోరుతూ కర్ణాటకను అభ్యర్థించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గతంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా అని సీఎం ప్రశ్నించగా... మూడేళ్ల క్రితం తీసుకున్నామని అధికారులు బదులిచ్చారు. అయితే... మరోసారి ఆ రాష్ట్రాన్ని అభ్యర్థించే పరిస్థితి రాకుండా.. ముందుగా కేఆర్ఎంబీకి లేఖ రాయాలని సూచించారు. నూతన పథకాలు వచ్చిన తర్వాత గతంలో ఉన్న అనేక నీటి వనరులను వదిలేశారని, ప్రస్తుతం వాటిని వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
కాగ్నా నుంచి తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలకు నీరు వినియోగించుకునే అవకాశం ఉందని, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత దానిని వదిలేశారని, అటువంటివి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఉంటాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. వీటితోపాటు అవసరమైన చోట తాగు నీటి బోర్లు, బావులు, మోటార్లకు మరమత్తులు చేయించాలని, ఇందుకు ఎమ్మెల్యేలకు కేటాయించిన ACDP నిధుల నుంచి రూ.కోటి, అవసరమైతే అంతకన్నా ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. జులై నెలాఖరు వరకు తాగు నీటి సమస్య తలెత్తకుండా చూసేందుకు ఆయా జిల్లాల్లో ఉన్న నీటి వనరులు, అవసరమైన తాగు నీటి పరిమాణం, సమస్యలు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించాలని సీఎస్‌కు సీఎం ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనూ తాగు నీటికి ఎటువంటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. నగరంలో ఇబ్బందులు లేవని, ఏదైనా కొరత ఏర్పడితే ఎల్లంపల్లి, నాగార్జున సాగర్ నుంచి కొంతమేర తెప్పించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నగరంలోని నీటి అవసరాలపై సూక్ష్మ స్థాయిలో సమీక్షించి తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం సూచించారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల రాకపోకలకు పోలీసుల నుంచి కొంత ఇబ్బంది ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వేసవి పూర్తయ్యే వరకు తాగు నీటి ట్యాంకర్ల రాకపోకల విషయంలో పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.