Ration Card: రేషన్ కార్డ్స్ ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి షురూ

Update: 2025-03-24 00:04 GMT

Telangana Ration: మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు త్వరలోనే భారీ గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం

 Ration Card: తెలంగాణలో రేషన్ కార్డ్స్ ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 30వ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్నిఅధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వచ్చే ఏప్రిల్ నుంచి నెలకు 6కిలోల సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ స్కీముతో రాష్ట్రంలో సుమారు 84 శాతం మంది ప్రజలు లబ్ది పొందుతారని స్పష్టం చేశారు. గతంలో రేషన్ ద్వారా అందజేసిన దొడ్డు బియ్యం ప్రజలకు అంతగా నచ్చకపోవడంతో వాటిని అమ్మేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. కానీ సన్నబియ్యం పంపిణీ ద్వారా ప్రజల ఆహార భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

ప్రజలు స్వచ్చమైన, నాణ్యమైన బియ్యాన్ని తినే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజలకు పోషకాహారం అందించేందుకు వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. నీటి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం తన అద్రుష్టంగా భావిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం క్రిష్ణా నదీ జలాల్లో కొంత మేర నీటి కొరత నెలకున్నా అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

రైతుల కష్టాలు ప్రభుత్వానికి తెలుసునని..అందుకే సాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి ప్రతివారం సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా పంటలు చివరి దశకు చేరిన ప్రాంతాల్లో నీటి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News