మీరు కూడా మా బిడ్డలే కేసీఆర్ భరోసా! ఆగిన కూలీల నడక!!

Update: 2020-03-30 03:09 GMT
KCR Press Meet

మీరు కూడా మా బిడ్డలే అంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసా వారిలో ఆశలు నింపింది. కరోనా మహామ్మారితో దేశం మొత్తం స్తంభించిపోయింది. తెలంగాణా కూడా ఆని దారులూ మూసేసింది. ఈ నేపధ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసం రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలకు కష్టాలు మొదలయ్యాయి. చేయడానికి పనీ లేదు.. తినడానికి తిండీ లేదు.. ఉండడానికి వసతీ లేదు. పోనీ తమ ప్రాంతానికి పోదామంటే రవాణా వ్యవస్థా లేదు. విషాదకర పరిస్థితిలో దుర్భరమైన జీవనాన్ని గడపలేక గుంపులు గుంపులుగా రహదారుల వెంబడి నడుచుకుంటూ తమ ప్రాంతాలకు వెళ్ళడానికి పయనమయ్యారు చాలామంది.

ప్రస్తుతం జాతీయ రహదారులపై ఇలాంటి అభాగ్యులు నడుస్తూ వెళ్ళడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఊరుకాని ఊరులో ప్రాణం పోగొట్టుకునే కంటే స్వంత ఊరిలో చచ్చిపోదామనేంత తెగింపుతో వందలాది కిలోమీటర్లు నడకతో వెళ్ళడానికి సిద్ధపడ్డారు వలస కూలీలు. ఇప్పటికే చాలామంది మార్గ మధ్యంలో ఉన్నారు. దారిలో కూడా వారికి ఏమాత్రం తిండి తిప్పలు దొరకడం లేదు. ఇంత నిస్సహాయంగా ఉన్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసా కోటి ఆశల్ని రేపింది. వలస కార్మికులు కూడా తమ బిడ్డలేనని.. వాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ముఖ్యమంత్రి నిన్న (మర్చి 29) న చేసిన ప్రకటన వలస కూలీలలో ఆనందాన్ని నింపింది. ఇతర రాష్ట్రాల వారికీ అర్థమయ్యేలా హిందీలో మాట్లాడిన కేసీఆర్ 'మీరూ మా బిడ్డలే. కడుపులో దాచుకుంటాం. రేషన్ కార్డు లేకున్నా బియ్యం ఇస్తాం. ఒక్కొక్కరికీ రూ.500 ఇస్తాం' అని ప్రకటించారు.

సదాశివపేట లో సివిల్ పనులు చేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలసి స్వస్థలాలకు పయనమయ్యారు. నడుస్తూ ఆందోల్ నియోజకవర్గంలోని బ్రాహ్మణ పల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడికి చేరేసరికి అందరూ నీరసించి ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న వారిని ఆ గ్రామస్తులు చూసి వారి వివరాలు తెల్సుకున్నారు. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో ఆయన వారికి బస ఏర్పాట్లు చేసి ఈ పరిస్థితుల్లో మీరు ఇళ్ళకు పోవడం సాధ్యం అవడాని చెప్పారు. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి ప్రకటన వెలువడింది. దీంతో మధ్యప్రదేశ్ కార్మికులు వెంటనే తమ మనసు మార్చుకున్నారు. ఇక్కడే ఉంటామని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో చెప్పారు. జోగిపేట్ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య సహకారంతో ఎమ్మెల్యే వారికి భోజన ఏర్పాట్లు చేయించి, రాత్రికి జోగిపేట్‌లోనే బస ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News