ఏప్రిల్ 3న రేవంత్ కేబినెట్ విస్తరణ?: రేసులో వీరే...

Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ 3వతేదీన ఉండే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు పదవులను భర్తీ చేయనున్నారు.

Update: 2025-03-25 09:15 GMT

Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ 3వతేదీన ఉండే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు పదవులను భర్తీ చేయనున్నారు. కేబినెట్ విస్తరణ కోసం కొన్ని రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు కాంగ్రె స్ పార్టీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు అంగీకారం తెలిపింది. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో చర్చించారు.

పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ కూర్పు ఉండనుంది. మంత్రివర్గ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలకు చోటు దక్కే అవకాశం ఉంది.ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రస్తుతం కేబినెట్‌లో చోటు దక్కలేదు. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి బి. అయిలయ్య యాదవ్,ఆది శ్రీనివాస్, విజయశాంతి పేర్లు తెరమీదికి వస్తున్నాయి.

అయిలయ్య యాదవ్ ది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇదే జిల్లాకు చెందిన ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలునాయక్ కూడా మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి మురళీనాయక్, రాంచంద్రునాయక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గత వారం రోజుల క్రితమే మంత్రివర్గంలో చోటు కల్పించాలని బాలు నాయక్ కోరారు. అసెంబ్లీలో మీడియాతో ఆయన చిట్ చాట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారం సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి కేబినెట్ లో చోటు దక్కుతుందని ప్రచారం సాగుతోంది. భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో కీలకంగా వ్యవహరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిపదవిని ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కింది.

మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అమీర్ అలీఖాన్ పేరు కూడా తెరమీదికి వచ్చింది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు. మరో వైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రేమ్ సాగర్ రావు కూడా కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మంత్రివర్గంలో చోటు దక్కని వారికి పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.

Tags:    

Similar News