Telangana Budget Session 2025: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Telangana Budget Session 2025: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి.

Update: 2025-03-12 05:46 GMT

Telangana Budget Session 2025: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Telangana Budget Session 2025: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని గవర్నర్ చెప్పారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని ఆయన అన్నారు.రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాల తమ ప్రభుత్వ సహకారం అందిస్తోందన్నారు.

ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేసిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నారు.తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అభివృద్ది, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఇందులో భాగంగానే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. రైతులకు రుణమాఫీ చేయడం తమ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని గవర్నర్ తెలిపారు.

రుణమాఫీతో 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామన్నారు. ఎకరానికి రూ. 12 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలను రాష్ట్ర అభివృద్దిలో రైతుల భాగస్వామ్యం చేస్తున్నామని గవర్నర్ తెలిపారు.

తెలంగాణ పురోగమించడమే కాదు... రూపాంతరం చెందుతోందన్నారు.సమ్మిళిత, స్వయం సమృద్ది సాధికార తెలంగాణ విజన్ తో పనిచేస్తున్నామన్నారు. అభివృద్ది, సమృద్దికి దిక్సూచిగా ఉండేలా తెలంగాణ నమూనా ఉండాలని గవర్నర్ అన్నారు. తెలంగాణ భౌగోళిక ప్రాంతమే కాదు.. ఒక భావోద్వేగమని ఆయన చెప్పారు. స్థిరత్వం, దృఢ సంకల్పానికి గుర్తే తెలంగాణ అని గవర్నర్ అన్నారు.

అసెంబ్లీకి కేసీఆర్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయ్యారు. గత ఏడాది అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారు. మార్చి 12న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం తర్వాత కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. 

Tags:    

Similar News