T Congress: హస్తినకు తెలంగాణ హస్తం నేతలు

* ఏఐసీసీ పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న ముఖ్యనేతలు * కాసేపట్లో కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో పార్టీ జనరల్‌ సెక్రటరీ సమీక్ష

Update: 2021-11-13 02:55 GMT

హస్తినకు తెలంగాణ హస్తం నేతలు(ఫైల్ ఫోటో)

T Congress: ఏఐసీసీ పిలుపుతో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కాసేపట్లో వార్‌ రూమ్‌లో పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో నేతలు చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఓటమి, అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు రావడంపై ప్రధానంగా చర్చించనున్నారు.

ఉదయం 10గంటల 30నిమిషాలకు వార్‌ రూంలో జరగనున్న సమీక్షకు రావాలని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సహా 13 మందికి ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. దేశంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించగా హుజూరాబాద్‌ బైపోల్‌లో ఘోర ఓటమిపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై సమీక్షించేందుకు ఎన్నికలో పాలుపంచుకున్న నాయకులను ఢిల్లీకి పిలిచింది.

ఇక ఢిల్లీకి వెళ్లినవారిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో పాటు భట్టి, ఉత్తమ్‌, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, షబ్బీర్‌అలీ, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పలువురు హస్తం నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం, ఆ స్థానాన్ని మరో నేతతో వెంటనే భర్తీ చేయకపోవడం, నోటిఫికేషన్‌ విడుదలయ్యే వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంపై వార్‌ రూమ్‌లో చర్చ జరిగే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు మరీ తక్కువ ఓట్లు రావడంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి నేతల మధ్య ఐకమత్యం లేకపోవడమే ప్రధాన కారణమని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News