బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతోన్న నిరసనలు

Basara IIIT: ఆరోరోజూ ఆందోళన చేపట్టిన విద్యార్థులు

Update: 2022-06-19 07:46 GMT

బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతోన్న నిరసనలు

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఆరోరోజు కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులతో చర్చలు సఫలం అయ్యాయని.. అన్ని డిమాండ్లకు ఒప్పుకున్నట్లు మంత్రి వివరించారు. అయితే విద్యార్థులు మాత్రం మంత్రి స్టేట్ మెంట్ ను తప్పుబట్టారు. అసలు తమ ప్రధాన డిమాండ్ అయిన పర్మినెంట్ వీసీ విషయంలో పీటముడి వీడలేదని.. దానికి ఒప్పకుంటేనే మిగతా వాటి విషయంలో చర్చలు జరుగుతాయని అంటున్నారు. మంత్రి ప్రకటన తర్వాత నిరసనలు కొనసాగాయి.

ముఖ్యంగా చర్చల సందర్భంగా.. విద్యార్థులకు, మంత్రికి మధ్య ఒకే అంశం దగ్గర చిక్కుముడి పడినట్లు తెలుస్తోంది. యూనివర్శిటీకి పర్మినెంట్ వీసీ కావాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేశారు. మిగతా అంశాలపై గురించి మంత్రి అడగ్గా.. ముందుగా వీసీ విషయంపైనే సమాధానం కావాలని పట్టుబట్టారు. ఈ విషయంలో స్పష్టత వచ్చాకే మిగతా సమస్యలపై చర్చిద్దామని.. విద్యార్థులు స్పష్టం చేశారు. అయితే కాసేపటి తర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటన చేస్తూ.. చర్చలు సఫలమైనట్లు ప్రకటించారు.

అయితే మంత్రి ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు.. చర్చలు విఫలమైనట్లు ప్రకటించారు. రాత్రి వర్షం పడుతున్న సమయంలో కూడా నిరసనలు ఆపలేదు. మరోవైపు నిన్న విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. బహిరంగ లేఖ రాశారు. యూనివర్శిటీ క్యాంపస్ రాజకీయాలకు వేదిక కారాదని.. పొలిటికల్ పార్టీల మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యలేవైనా.. ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ తో చర్చించి పరిష్కారం చేసుకోవాలని సూచించారు. తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. సమస్యలను తానెప్పుడూ తక్కువ చేసి చూడలేదన్నారు.

Tags:    

Similar News