గంటల వ్యవధిలోనే గప్‌చుప్

Update: 2019-09-11 02:23 GMT

24 గంటలు కూడా పూర్తి కాలేదు నోరు తెరిచి నిరసన గళం విప్పిన నేతలంతా అంతలోనే మాట సరిచేసుకున్నారు. నిన్నటి వరకు కేబినేట్‌ బెర్త్‌లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేతలంతా అబ్బే అలాంటిదేం లేదని స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంపై గులాబీ పార్టీలో రేగిన కలకలం టీ కప్పులో తుఫాను మాదిరిగా సద్దుమణిగింది. గంటల వ్యవధిలోనే అంతా గప్‌ చుప్‌ అయ్యారు. అసహనం వ్యక్తం చేసిన నేతలంతా కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కేబినేట్‌లో బెర్త్‌ దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేస్తున్నారు.

కేబినేట్ విస్తరణపై సీనియర్ల నుంచి ఈ మధ్యే ఎన్నికైన నేతల వరకు పార్టీ అధిష్టానంపై నిరసన గళం విప్పారు. అంతేకాదు ఏకంగా కొందరు అజ్ఞాతంలోకి వెళ్లగా మరికొందరు పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే రంగంలోకి దిగిన అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గౌరవప్రదమైన పదవులు ఇస్తామని సమాచారం అందించింది. అసంతృప్తులంతా దారిలోకి తెచ్చుకుంది.

ఉద్యమం నుంచి ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్‌ లు ఎవరికీ ఇవ్వని గౌరవం తనకిచ్చారని మాజీ ఉపముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య అన్నారు. మొన్నటి వరకు స్టేషన్ ఘన్ పూర్ కే పరిమితమైన తనను తెలంగాణ రాజయ్యగా గుర్తింపు ఇచ్చారని చెప్పారు.

మరోవైపు పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం తనది కాదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తుచేశారు. పార్టీ మారతానంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. మంత్రి పదవులు రానందుకు ఎలాంటి అసంతృప్తి లేదని తెలిపారు.

పరిస్థితి మరింత వివాదంగా మారకముందే అధిష్టానం సరైన సమయంలో చర్యలు తీసుకుంది. అలాగే ఈ విషయంపై మీడియాతో ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. 

Tags:    

Similar News