Indiramma Housing Scheme: గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపిక ప్రారంభం
Indiramma
Indiramma Housing Scheme: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చేందుకు అర్హుల ఎంపికను ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రారంభించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 26న రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయితీల్లో పథకాన్ని ప్రారంభించి అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు.
తొలి విడతలో 72,045మందికి ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు గతంలో జాబితాను ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాల్లోని తక్కిన పల్లెల్లో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు. రాష్ట్రంలో అందిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేశారు. దరఖాస్తుదారులను ఎల్ 1 , ఎల్ 2 , ఎల్ 3 అని మూడు జాబితాలుగా విభజించారు.
ఆ వివరాలన్నీ మండల పరిధిలో ఎంపీడీవో, పురపాలిక పరిధిలో కమిషనర్ల లాగిన్ కు చేరాయి. ఇలా తొలి విడత పరిశీలన పూర్తవ్వగా ఇప్పుడు ఎల్ 1 జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ జాబితాలో 21.93లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 72వేల మంది అర్హులను మినహాయించి మిగతావారి ఇళ్లకు వెళ్లి రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో అతి పేదలను గుర్తిస్తారు.