Viral Fevers: తెలంగాణలో వణికిస్తున్న సీజనల్‌ వ్యాధులు

Viral Fevers: జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న ప్రతి పది మంది ఇద్దరు

Update: 2023-09-02 06:31 GMT

Viral Fevers: తెలంగాణలో వణికిస్తున్న సీజనల్‌ వ్యాధులు

Viral Fevers: తెలంగాణలో సీజనల్ రోగాలు వణికిస్తున్నాయి. ప్రతి పది మందిలో ఇద్దరు జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. సీజనల్‌ వ్యాధుల బారిన పడిన వాళ్లు వారం నుంచి పది రోజుల దాకా కోలుకోవడం లేదు. నాలుగైదు రోజుల్లో జ్వరం తగ్గుతున్నా.. ఒళ్లు నొప్పులు వారం వరకు తగ్గడం లేదు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు దవాఖాన్లలో అడ్మిట్‌ అవుతున్నారు. అలా చేరుతున్న వారిలో కరోనా, స్వైన్ ఫ్లూ తరహా లక్షణాలు ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

టెస్టులు చేస్తే మాత్రం కరోనా, స్వైన్‌ ఫ్లూ నెగెటివ్ వస్తోందని అంటున్నారు. దగ్గు, జలుబుకు కారణమయ్యే ఇన్‌‌ఫ్లూయంజా వైరస్‌‌లు వందల రకాలు ఉంటాయని, ఇవే మ్యుటేట్ అయ్యి లక్షణాలను మార్చుకోవడం సహజమని వైద్యులు చెబుతున్నారు. ఈ సీజన్‌‌లో దగ్గు, జలుబు సహజమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు .సీజనల్ రోగాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ దవాఖాన్లలో ఇన్‌పేషెంట్ల సంఖ్య గతేడాది కంటే తక్కువగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. జలుబు, జ్వరాలు ఉన్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువగా ఉండడం వల్లే హాస్పిటల్ అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయంటున్నారు.

సాధారణంగా ఇప్పుడు వచ్చే జలుబుకు రైనోవైరస్ కారణమై ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ వ్యక్తుల వల్ల, వైరస్ అంటుకున్న వస్తువుల నుంచి వైరస్ మనకు సోకుతుంది. రైనోవైరస్ ఇన్ఫెక్షన్ చాలా వరకు ముక్కు, గొంతు, తల భాగాలకు పరిమితమవుతుంది. ఇది సాధారణ జలుబు కాబట్టి యాంటిబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు. కానీ ఒళ్లు నొప్పులు, జ్వరం, తలనొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్‌‌‌‌ను సంప్రదించడం మంచిదని అధికారులు అంటున్నారు.

మహారాష్ట్ర, కర్నాటకలో కొత్త వైరస్ వస్తోందని, ఇక్కడకు స్ప్రెడ్ అవుతున్నదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని వైద్యులు తెలిపారు. కానీ ఇన్‌‌ఫ్లూయంజా వైరస్‌‌ కారణంగా ప్రజలు జ్వరం, దగ్గు, జలుబుతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధికారులు వెల్లడించారు.. ఈ సీజన్‌‌లో వచ్చే ఫ్లూ వైరస్‌‌లో, ఈ తరహా సింప్టమ్స్‌‌ సహజంగా కనిపిస్తాయని వైద్య అధికారులు తెలిపారు. కొవిడ్, స్వైన్‌‌ఫ్లూ నెగటివ్ వచ్చినంత మాత్రాన కొత్త వైరస్ వచ్చినట్టు కాదని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. ఇంట్లో ఒకరికి సోకినప్పుడు ఇంకొకరికి అంటించ కుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News