Kavitha: 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కానీ పాతవే భర్తీ చేశారు
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గళమెత్తారు.
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గళమెత్తారు. గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత, ప్రిలిమ్స్ పరీక్షల నుంచే అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బోగస్ ఉద్యోగాలు సృష్టించవద్దని ఆమె డిమాండ్ చేశారు.
నిరుద్యోగులను మోసం చేసింది
నిరుద్యోగుల పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కవిత మండిపడ్డారు. అభ్యర్థులు ఏళ్ల తరబడి కష్టపడుతున్నారని, కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చాక పాత ఉద్యోగాలనే ఇస్తోందని దుయ్యబట్టారు. గతంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
"పారదర్శకంగా పరీక్షలు పెట్టండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక పాత ఉద్యోగాలే ఇచ్చారు. ఇవి తప్పుడు పరీక్షలు. కాంగ్రెస్ కోసం వారిని ఎంపిక చేశారు," అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించాలి
ఈ మొత్తం వ్యవహారంపై మేధావులు స్పందించాలని కవిత కోరారు. ముఖ్యంగా, ప్రొఫెసర్ హరగోపాల్ గురించి ప్రస్తావిస్తూ, "మిమ్మల్ని విద్యార్థులు నమ్మారు.. వారి పక్షాన నిలబడండి," అని విజ్ఞప్తి చేశారు.
చివరిగా, అభ్యర్థుల తరఫున గట్టి డిమాండ్ చేస్తూ, "మూల్యాంకనం సరిగా జరగాలి. కోర్టుల్లో జడ్జీలకు అర్థం అయ్యేదాకా పోరాటం చేస్తాం. గ్రూప్-1 నియామకాలను రద్దు చేసి.. మళ్లీ పరీక్ష నిర్వహించాలి" అని కవిత డిమాండ్ చేశారు.