Sankranti Special Buses: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఆర్టీసి గుడ్ న్యూస్.. 5,500పైగా స్పెషల్ బస్సులు..!!

Sankranti Special Buses: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఆర్టీసి గుడ్ న్యూస్.. 5,500పైగా స్పెషల్ బస్సులు..!!

Update: 2026-01-06 05:44 GMT

Sankranti Special Buses: సంక్రాంతి పండుగను సొంత ఊళ్లలో జరుపుకోవాలని భావిస్తున్న ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) శుభవార్త అందించింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు భారీ ఎత్తున ప్రత్యేక బస్సులు నడపడానికి సిద్ధమైంది. మొత్తం మీద 5,500కు పైగా స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

తెలుగు ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ సంక్రాంతి. విద్య, ఉద్యోగాలు, ఉపాధి కారణాలతో దూర ప్రాంతాల్లో ఉన్న వారు ఈ పండుగ సమయంలో తప్పనిసరిగా స్వగ్రామాలకు వెళ్లాలని కోరుకుంటారు. అయితే సంక్రాంతి వేళ రైళ్లలో టికెట్లు దొరకడం కష్టసాధ్యమవుతుంది. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులపై ఆర్థిక భారం మోపుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు ఊరట కలిగించేలా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి తెలంగాణ జిల్లాలకు మూడు రోజుల వ్యవధిలో 2,500కు పైగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 3,000 వరకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జనవరి 9 నుంచి ప్రత్యేక సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. అవసరమైతే బస్సుల సంఖ్యను మరింత పెంచేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ముందస్తు ప్రణాళికతో ప్రయాణం చేయాలనుకునే వారి కోసం పెద్ద సంఖ్యలో బస్సులను ఆన్‌లైన్ రిజర్వేషన్‌కు అందుబాటులో ఉంచనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. దీంతో చివరి నిమిషంలో టికెట్ల కోసం ఆందోళన పడాల్సిన అవసరం ఉండదని అధికారులు పేర్కొన్నారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రయాణించే వారి సౌకర్యార్థం కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ముఖ్యంగా బీహెచ్‌ఈఎల్ పరిధిలోని ఆర్సీపురం డిపో నుంచి సంక్రాంతి స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆర్సీపురం నుంచి మియాపూర్, కేపీహెచ్‌బీ, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, చీరాల, విజయవాడ తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

ఆర్సీపురం డిపో నుంచి నడిచే సంక్రాంతి ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ సుధా తెలిపారు. ఈ సర్వీసులకు సంబంధించి ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్‌ను ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9959226149 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ప్రయాణికుల అవసరాలను బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆమె స్పష్టం చేశారు.

Tags:    

Similar News