Indiramma Illu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కీలక అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం నేడు ముఖ్యమంత్రి ఉదయం 11.30కి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో కొడంగల్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.25కి హెలికాప్టర్ లో బయలుదేరి 12.50కి నారాయణపేట జిల్లా కేంద్రమైన సింగారానికి వెళ్తారు. జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. ఆ తర్వాత అప్పర్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి స్వయంగా ముగ్గు పోస్తారు.
మధ్యాహ్నం 1.30కి ప్రభుత్వాసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో కాసేపు మాట్లాడతారు. మధ్యాహ్నం 2.10కి నారాయణపేట జల్లా కేంద్రలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఇలా టూర్ షెడ్యూల్ ఖరారు చేసిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసింది.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఎంతో ముఖ్యమైంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. త్వరలోనే మళ్లీ కేసీఆర్ సారధ్యంల ప్రభుత్వం వస్తుందన్నారు. స్వయంగా కేసీఆర్ కూడా రంగంలోకి దిగి ప్రభుత్వం పనిఅయిపోయిందన్నారు. అయితే ఈ విమర్శలను కాంగ్రెస్ నేతలు కొందరు ఖండించినా..అవి సరైన కౌంటర్లు ఇవ్వలేకపోయాయి. దాంతో కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ గా ఈ విమర్శలు డ్యామేజ్ చేశాయన్న వాదన కూడా ఉంది. అందుకే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి కౌంటర్లు వేస్తారన్నది చూడాల్సి ఉంది.