Revanth Reddy
Revanth Reddy comments on KTR: హరీష్ ను ఉపయోగించుకొని కేటీఆర్ రాజకీయాన్ని ముగిస్తామని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. బావ బావమరుదులను ఎలా డీల్ చేయాలో తెలుసునన్నారు. కేటీఆర్ ను ఉపయోగించి కేసీఆర్ ఉనికి లేకుండా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక హరీష్ ను ఉపయోగించి కేటీఆర్ రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పెడతామని ఆయన తెలిపారు. పోలీసులను ఉపయోగించుకొని నిర్భంధించవచ్చు...కానీ, అది తన విధానం కాదని రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.
మూసీ పనులకు టెండర్లు
ఈ ఏడాది నవంబర్ 1న మూసీ పునరుజ్జీవనం పనులకు శంకుస్థాపన చేస్తామని ఆయన చెప్పారు. రాజకీయంగా నష్టం జరిగినా ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. మూసీలో గోదావరి నది నీటిని తరలించేందుకు అవసరమైన పనులకు టెండర్లను కూడా పిలుస్తామని ఆయన తెలిపారు.
దీపావళి పార్టీలో సారా బుడ్లు ఎలా వచ్చాయి?
మాకు దీపావళి అంటే చిచ్చుబుడ్లు...కానీ, రాజ్ పాకాల ఇంట్లో దీపావళి పార్టీ అంటే సారా బుడ్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయని చెప్పారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని సీఎం ప్రశ్నించారు. దీన్ని దీపావళి పార్టీ అంటారా, సారా బాటిళ్ల సెలబ్రేషన్సో చెప్పాలన్నారు.
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు అరెస్టు చేస్తాం
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ ఓఎస్ డీగా పనిచేసిన ప్రభాకర్ రావు తో పాటు శ్రవణ్ రావులు అరెస్టు అవుతారని ఆయన చెప్పారు. ఈ ఇద్దరి పాస్ పోర్టులు రద్దైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఇద్దరి అరెస్ట్ తో ఈ కేసులు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.