మోదీపై రేవంత్, రాహుల్ పై బండి: తెలంగాణలో కులాలపై వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
మోదీపై రేవంత్, రాహుల్ పై బండి: తెలంగాణలో కులాలపై వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలకు అదే స్థాయిలో బీజేపీ కౌంటరిచ్చింది. రాహుల్ గాంధీ ముస్లిం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రాహుల్ గాంధీ కుటుంబంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? ఎవరు ఏమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 14న అన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన కులగణన సర్వే పవర్ పాయింట్ ప్రజేంటేషన్ లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కులాన్ని బీసీ కులాల్లో కలుపుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ కులం బీసీ సామాజిక వర్గం కాదని, ఉన్నత సామాజికవర్గమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్
మోదీ సామాజిక వర్గంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ , మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా ఆ పార్టీ నాయకులు పలువురు రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర మండి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది.
10 జన్‌పథ్ లో కులం లేదు, మతం లేదు, ఒక దేశం లేదు అంటూ ఆయన విమర్శించారు. సోనియాగాంధీ ఇటలీ దేశస్తురాలు అని అన్నారు. నరేంద్ర మోదీ బీసీ కాకపోతే... రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం, జాతి, ఏ దేశమని బండి సంజయ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ముస్లిం అని బండి సంజయ్ చెప్పారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డ జగ్గారెడ్డి
బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. రాహల్ గాంధీ కుటుంబ సభ్యులు హిందువులని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందినవారని ఆయన వివరణ ఇచ్చారు. రాజీవ్ గాంధీ బ్రహ్మణుడైనందున సోనియా గాంధీకి కూడా అదే సామాజిక వర్గం వర్తిస్తోందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో రాజీవ్ గాంధీ కుటుంబం పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందిరాగాంధీ భర్త గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.