ఆటవిక దాడి అందుకే.. అలా జరిగింది!

Update: 2019-07-01 05:09 GMT

ఇంతలా సంచలనం సృష్టించిన అటవీ అధికారిణిపై దాడి ఘటన వెనుక కారణాలేంటి..? అసలు అక్కడికి అటవీ అధికారులు ఎందుకు వెళ్లారు..? అక్కడి ప్రజాప్రతినిధులు ఎందుకు అడ్డుకున్నారు..?

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాల్వలు, టన్నెళ్లు తదితరాల తవ్వకంలో 3 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం పోయింది. దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రప్రభుత్వం అటవీ ప్లాంటేషన్‌ చేసేందుకు వివిధ ప్రాంతాల్లో భూములు కేటాయించింది. కాగజ్‌నగర్‌ సమీపంలోని కొత్త సార్సాలలో 220 హెక్టార్ల భూమిని కేటాయించింది. దీంతో నిన్న ఆదివారం ఉదయం డీఎస్పీ సాంబయ్య, సీఐ కిరణ్‌, అదనపు బలగాలతో సార్సాల గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడి 138, 139 కంపార్టుమెంట్లలో ఉన్న 220 హెక్టార్ల రిజర్వు ఫారెస్టు భూమిలో.. ప్లాంటేషన్‌ ప్రక్రియ చేపట్టారు. దీంతో తాము కొన్నేళ్ల నుంచి పోడు చేసుకుంటున్నామని, ప్లాంటేషన్‌ ఎలా చేస్తారని రైతులు అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వివరించి అధికారులు ప్లాంటేషన్‌ను ప్రారంభించారు. అదే సమయంలో, ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కృష్ణ అక్కడికి చేరుకున్నారు. మహిళా అటవీ సిబ్బందిపై బూతులు తిడుతూ విరుచుకుపడ్డారు. ట్రాక్టర్‌పై ఉన్న ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ అనితపై దాడి చేశారు.

అయితే ఆమెపై కృష్ణ దాడి చేస్తున్న సమయంలో.. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ అడ్డుకున్నాడు. దాంతో, అదే కర్రతో ట్రాక్టర్‌పై ఆయన పదే పదే బాదాడు. ఇదే అదనుగా మహిళా అధికారిణిపై కృష్ణ ప్రధాన అనుచరుడు బూరం పోశం.. తీవ్రంగా దాడి చేశారు. కర్రతో రెండు సార్లు బలంగా బాదాడు. ఇతర అనుచరులు కూడా ఆమెపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. తలకు, చేతికి బలమైన గాయాలు కావడంతో ఎఫ్‌ఆర్‌వో అనిత అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న ఇతర సిబ్బందిపైనా కృష్ణ అనుచరులు దాడి చేశారు. వారిలో పలువురు మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. అనితను అధికారులు, సిబ్బంది వెంటనే కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు.  


Tags:    

Similar News