Private Drivers Protest : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ ప్రభావం ప్రయివేటు సంస్థలపైన, ప్రయివేటు ఉద్యోగులపైన, చిరు వ్యాపారులపైన పడి వారు ఎంతగానో నష్టపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ ప్రయివేటు ఉద్యోగులు, చిరువ్యాపారులు ఇంకా నష్టాల ఊబి నుంచి బయటికి రాలేకపోతున్నారు. దీంతో వారంతా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కొంత మంది ప్రయివేటు డ్రైవర్ లు తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నాలు చేసారు. అది సఫలం కాకపోగా వారంతా ప్రస్తుతం గోశామహల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.
ఇక ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ కొంత మంది ప్రైవేటు డ్రైవర్లు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రగతిభవన్ ముట్టడిని అడ్డుకున్నారు. దీంతో ప్రయివేటు డ్రైవర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరోనా కారణంగా తామంతా ఎంతగానో నష్టపోయామని, ప్రతీ ప్రైవేట్ డ్రైవర్ అకౌంట్‌లో రూ.20 వేలు వెయ్యాలని ప్రైవేట్ డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముట్టడి ప్రయత్నాలు చేసారు. దీంతో పోలీసులు వారందరనీ అదుపులోకి తీసుకుని గోశామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదిలా ఉంటే మరో వైపు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు కూడా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఇవాళ చలో బస్ భవన్‌కు పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ధర్నా నిర్వహించారు. అంతే కాదు తెలంగాణ ఆర్టీసీ ఎండి, ట్రాన్స్‌పోర్టు మంత్రి పువ్వాడ అజయ్ తీరును నిరసిస్తూ ఫ్ల కార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో బస్ భవన్ ఎదుట కూడా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.