PM Modi: భారత జవాన్లతో కలిసి మోదీ దీపావళి సంబరాలు
PM Modi: జవాన్లకు స్వీట్లు తినిపించిన మోడీ
PM Modi: భారత జవాన్లతో కలిసి మోదీ దీపావళి సంబరాలు
PM Modi: భారత జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు ప్రధాని మోడీ. భారత సరిహద్దులో గస్తీ కాస్తున్న జవాన్లతో కలిసి దీపావళి సంబురాల్లో పాల్గొన్నారు. మోడీ ప్రతి ఏటా దీపావళి వేడుకలను బార్డర్‌లో ఉన్న సైనికులతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎప్పటి లాగే ఈసారి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. చైనా సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న లెప్చా వద్ద ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు, సరిహద్దు భద్రత జవాన్లతో కలిసి దీపావళి పండగను జరుపుకున్నారు.
జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. అనంతరం జవాన్లకు స్వీట్లను పంచి పెట్టారు మోడీ. కాసేపు జవాన్లతో ముచ్చటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ దీపావళి సెలబ్రేషన్స్‌ను తమతో జరుపుకోవడం ఆనందంగా ఉన్నారు జవాన్లు.
చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది లెప్చా ప్రాంతం. హిమాచల్ ప్రదేశ్‌లో 260 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది చైనా. చైనా సరిహద్దు ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు ఆర్మీ అధికారులు. ఈ 260 కిలోమీటర్ల పొడవులో దాదాపుగా 20 అవుట్ పోస్ట్‌లు ఉంటాయి. ఒక్కో అవుట్ పోస్ట్‌లో అయిదు బెటాలియన్ల మేర ఐటీబీపీ జవాన్లను మోహరించారు ఆర్మీ అధికారులు. అలాంటి కీలక ప్రాంతాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. తాను ప్రతి సంవత్సరం ఆర్మీ సిబ్బందితో దీపావళి పండగను జరుపుకుంటున్నానని మోడీ తెలిపారు.
శ్రీ రాముడు ఉన్న స్థలాన్ని అయోధ్య అని అంటారు. కానీ, తన దృష్టిలో భరతమాత రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన భద్రత దళాలు ఉండే చోటునే తాను అయోధ్యగా పిలుస్తానన్నారు. మన భద్రతా బలగాల ధైర్యం వెలకట్టలేనిది. తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎంతో కష్టతరమైన ప్రాంతాల్లో పహారా కాస్తుంటారని జవాన్ల కృషిని కొనియాడారు. వారి త్యాగం, దేశం పట్ల అంకితభావం వలనే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నామన్నారు. ధైర్యంతో శత్రువుల నుంచి మనల్ని కాపాడుతున్న వీరులకు భారతదేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు మోడీ.