BC Reservations: తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కులగణన సర్వే ఎందుకు చేపడుతోంది.. పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా?

BC Reservations: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2025-02-13 09:56 GMT

తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కులగణన సర్వే ఎందుకు చేపడుతోంది.. పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా?

BC Reservations: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ తీర్మానం చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపుతామని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన సర్వే చేయనున్నారు. ఇటీవల చేసిన సర్వేలో బీసీల జనాభా తగ్గిందని విపక్షాలు ఆరోపించాయి. కానీ, ఈ వాదనను రేవంత్ సర్కార్ తోసిపుచ్చింది. బీసీ జనాభా పెరిగితే తగ్గిందని ఎలా చెబుతారని ప్రశ్నిస్తోంది? మరోసారి కులగణన సర్వే చేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం విపక్షాలకు ఆయుధాన్ని ఇస్తోందా? దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలంటూ అసెంబ్లీ తీర్మానంతో రేవంత్ సర్కార్ సెల్ఫ్ గోల్ చేసుకుందా? నష్ట నివారణకు బీసీలకు రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పిస్తామని తెరమీదికి తెచ్చిందా? ప్రభుత్వం ఏం చెబుతోంది? విపక్షాలు ఏమంటున్నాయి? ఎవరి వాదన ఏంటో తెలుసుకుందాం.

మళ్లీ కులగణన సర్వే ఎందుకు?

కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం 2025 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే నిర్వహించనున్నారు. 2024 నవంబర్ 6 నుంచి 50 రోజుల పాటు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 96.9 శాతం కుటుంబాలు పాల్గొన్నాయి. 3.1 శాతం కుటుంబాలు సర్వేకు దూరంగా ఉన్నాయి. సర్వేకు దూరంగా ఉన్నవారికి మరో అవకాశం కల్పించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వం కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది. మండల కార్యాలయాల్లో సర్వేలో పాల్గొనని కుటుంబాలు తమ సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఆన్ లైన్ ద్వారా కూడా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని కూడా సూచించింది. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తమ ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని కోరితే అధికారులు వస్తారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

బీసీలకు విద్య,రాజకీయ, ఆర్ధిక రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది. బీసీల జనాభా 56 శాతం ఉన్నట్టు తాజా సర్వేలో తేలిన విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తు చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో జరిగిన సభలో బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మాణాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనుంది. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి. పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందడానికి గాను రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టనున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బృందం దిల్లీకి వెళ్లనుంది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి?

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై మార్చిలో నిర్వహించే కేబినెట్ సమావేశం ఆమోదించాలి. ఈ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు. ఈ తీర్మానం ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపుతారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అవుతుంది. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమకు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే తీర్మానాల విషయంలో సానుకూలంగా ఉంటాయి. ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావాలంటే ఎన్ డీ ఏ పక్షాలతో పాటు ఇండియా కూటమి పక్షాలు కూడా సానుకూలంగా ఉండాలి. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. తమిళనాడులో మాత్రమే 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. పార్లమెంట్ లో చట్టం చేసినా అది కోర్టుల్లో నిలబడాలి.

స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం

స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామపంచాయితీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. 2024 మే 31తో సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు 2019 మేలో ఎన్నికలు జరిగాయి. 2024 జులై 3న మండల పరిషత్, జలై 4న జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది.ఇక మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు 2025 జనవరి 26తో గడువు పూర్తైంది. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత రావడానికి సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ రిజర్వేషన్లు అమలు కావాలంటే పార్లమెంట్ చట్టం చేయాలి. పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలంటే పార్టీల మద్దతు అవసరం. అన్ని అడ్డంకులు దాటుకొని పార్లమెంట్ లో ఆమోదం పొందితే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అంటే అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేనట్టే.

Tags:    

Similar News