Orange Alert : తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్

Orange Alert: మరో రెండురోజులు భారీ వర్షాలు *13 జిల్లాల్లో అతి భారీగా కొన్ని చోట్ల భారీ వానలు

Update: 2021-08-31 05:42 GMT

తెలంగాణలో ఆరంజ్ అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలో రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో సగటున 20 సెంటీమీటర్ల వాన కురిసింది. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పలువురు గల్లంతు కాగా ఐదుగురు మరణించారు. వికారాబాద్‌, వరంగల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాలు వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్నాయి. వర్షాలకు పలు జిల్లాల్లో కాలనీలు నీటమునిగాయి.అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని నదులు, వాగులు, వంకలు, పొంగి పొర్లుతున్నాయి. ఎగువనున్న మహారాష్ట్రలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న కారణంగా జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరడంతో నిండుకుండ నుతలపిస్తున్నాయి. భైంసా డివిజన్ వ్యాప్తంగా 12 సెంటిమీటర్లు, నిర్మల్ జిల్లాలో 2.2 సెంటిమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని కడెం, గడ్డెన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల రిజర్వాయర్‌లలోకి ఎగువ నుంచి వరదనీటి ఉదృతి పెరగడంతో గేట్లను ఎత్తిదిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

నిర్మల్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. భైంసా మండలం మహాగామ్ - గుండెగావ్ బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహించడంతో ఆ రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుభీర్ మండల కేంద్రంలో భారీ వర్షంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మేదరి గల్లీ లో వరద నీటిలో చిక్కుకున్న 8 మందిని స్థానికుల సాయంతో పోలీసులు సురక్షితంగా కాపాడారు. కుబీర్ ముంపు వాసులకు గ్రామ పంచాయితీ కార్యాలయంలో తాత్కాలికంగా పునరావాసం కల్పించారు.ఇవాళ, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, సిద్దిపేట, వికారాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీచేసింది. హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీచేస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Tags:    

Similar News