TG High Court: సినిమా టికెట్ల ధరల పెంపు , ప్రత్యేక షోల అనుమతిపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారించి కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్బంగా థియేటర్లలోకి చిన్నారుల అనుమతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లలో 16ఏళ్ల లోపు పిల్లల అనుమతిపై ఆంక్షలను విధించింది. ఉదయం 11లోపు షోలకు చిన్నారులను అనుమతించవద్దని థియేటర్ యాజమాన్యాలను ఆదేశించింది. వేళపాలలేని షోలకు పిల్లలు వెళ్లడం సరైంది కాదని పిటిషనర్ పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందన్నారు. ఈ సందర్భంగా పిటిషనర్ వాదనను కోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా నుంచి టికెట్ల ధరలు పెంపు, అదనపు షోల అంశం వివాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై పలవురు హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు సీరియస్ గా తీసుకుంది. ప్రత్యేక ప్రదర్శనలకు రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇవ్వడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రకటించిన తర్వాత కూడా ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతి పునసమీక్షించాలంటూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాను హైకోర్టు ఆదేశించింది. భారీ బడ్జెట్ తో తీసి నిర్మాతలు ప్రేక్షకుల నుంచి డబ్బును వసూలు చేయాలనుకోవడం సరైందని కాదని కోర్టు అభిప్రాయపడింది. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదం తర్వాత కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం సరైందని కాదని అభిప్రాయపడింది.