Nizamabad : అవినీతికి కేరాఫ్గా అడ్రస్‌గా మారిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి అక్రమాలకు కేరాఫ్గా అడ్రస్‌గా మారాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనుల కోసం వెళితే రోజుల తరబడి తిప్పుకుంటున్నారని పలువురు వాపోతున్నారు.
Nizamabad : అవినీతికి కేరాఫ్గా అడ్రస్‌గా మారిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి అక్రమాలకు కేరాఫ్గా అడ్రస్‌గా మారాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనుల కోసం వెళితే రోజుల తరబడి తిప్పుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని రిజిస్ట్రేషన్ల విషయంలో.. అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోగస్ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయడంలోనూ ఆరి తేరారని ప్రజలు మండిపడుతున్నారు. మోసపోయిన బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మరి ఈ అవినీతి అక్రమాలకు అడ్డుకట్టవేసి.. వీరికి న్యాయం చేసేదెవరూ...
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్, భీంగల్ తదితర ప్రాంతాల్లో.. సబ్ రీజస్టార్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రెస్గా నిలుస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. బోగస్ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయడంలో అధికారులు ఆరి తేరారట. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా డాక్యుమెంట్లు సృష్టించి, స్థిరాస్తిపై హక్కులు ప్రసాదించడం.. ఈ శాఖకే చెల్లిందనె ఆరోపణలున్నాయి. నిజామాబాద్ అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్లకు బైపాస్ రోడ్డులోని భూములు కాసుల వర్షం కురిస్తున్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు.
వక్రమార్గంలో నడిచే రిజిస్ట్రార్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మచ్చిక చేసుకుని.. కోట్లు విలువ చేసే భూములకు బోగస్ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తుల పేరిట పేరు మార్పిడి చేయించుకుంటున్నారు. లేని నకిలీ రికార్డులను రూపొందించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నెలల వ్యవధిలోనే చేతులు మారినట్లుగా చూపించి అక్రమిత భూములను సక్రమం దిశగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ భూముల వ్యవహారంలో అధికార పార్టీలోని కీలక నేతల పాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.
నిజామాబాద్ బైపాస్ రోడ్డు చుట్టు పక్క భూములను.. టార్గెట్గా చేసుకుని అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్న పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు, పని చేసే సిబ్బంది, అటెండర్లకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా పనులు జరుగుతున్నాయి. కీలకమైన పత్రాలను స్కాన్ చేసి, పేరు మార్పిడి చేసే చోట స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఉద్యోగులు మినహా వేరే వారికి అనుమతి ఉండదు.. కానీ ఒకవేళ ఎవరైనా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కానీ నిజామాబాద్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వారిదే హవా. డబుల్ రిజిస్ట్రేషన్లతో అక్రమార్కులు చేస్తున్న దందాలో సామాన్యులు ఇరుక్కొని విలవిలలాడుతున్నారు.
డాక్యుమెంట్ రైటర్ల సహాయం లేకుండా ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాదంటే నమ్మశక్యం కాదు. నేరుగా సామాన్యుడే స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న దాఖలాలు చాలా అరుదు. మధ్యవర్తులుగా వ్యవహరించే డాక్యుమెంట్ రైటర్లు ఎంత చెబితే అంతా. వారు ఏ డాక్యుమెంట్ ఇస్తే అదే సర్వం. అందులో ఏముంది. ఎలాంటి అంశాలు పొందు పర్చారు. అమ్మేవారు, కొనేవారు నిజమేనా? అన్న వాస్తవాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెక్ చేసుకోవడం అన్నది డొల్లగా మారింది. గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ఉన్నతాధికారులు విచారణను తూతూ మంత్రంగా నిర్వహించి సమస్యలను దాటవేశారని ఆరోపణలు కూడా లేకపోలేదు.