కేసీఆర్ కాళేశ్వరం విచారణపై కీలక నిర్ణయం: ఓపెన్ కోర్ట్ రద్దు, తుది దశకు కమిషన్ విచారణ
మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు. అనారోగ్య కారణాలతో ఓపెన్ కోర్ట్ విచారణను కమిషన్ రద్దు చేసింది. విచారణ తుది దశకు చేరడంతో త్వరలో తుది నివేదిక విడుదల.
కేసీఆర్ కాళేశ్వరం విచారణపై కీలక నిర్ణయం: ఓపెన్ కోర్ట్ రద్దు, తుది దశకు కమిషన్ విచారణ
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ తుది దశకు చేరింది. ఇందులో భాగంగా బీఆర్కే భవన్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. సిద్దిపేట ఫాం హౌస్ నుంచి బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన కేసీఆర్, నేరుగా కమిషన్ విచారణకు వెళ్లారు.
అయితే తనకు జలుబు వచ్చినట్లు కేసీఆర్ కమిషన్‌కి తెలపడంతో, కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఓపెన్ కోర్ట్ విచారణను రద్దు చేసి, ఇన్‌డోర్ విచారణకు మారారు. ఈ విచారణకు కేసీఆర్‌తో పాటు కమిషన్ సెక్రటరీ మురళీధర్ రావు కూడా హాజరయ్యారు. మీడియా ప్రతినిధులు, ఇతర సిబ్బందిని బయటకు పంపించడం గమనార్హం.
విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ నేతలు:
కేసీఆర్‌తో పాటు కమిషన్ అనుమతితో 9 మంది బీఆర్‌ఎస్ నాయకులు విచారణకు హాజరయ్యారు. వీరిలో మాజీ మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఎంపీ రవిచంద్ర తదితరులు ఉన్నారు. బీఆర్కే భవన్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా గుమికూడగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇంతకు ముందు విచారణలు:
ఇప్పటికే కమిషన్ ముందు మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌తో పాటు 114 మంది అధికారులు, ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. ఇక ఇప్పుడు కేసీఆర్ విచారణతో కమిషన్ దర్యాప్తు చివరి దశకు చేరినట్టు స్పష్టం అవుతోంది.
తుది నివేదిక త్వరలోనే:
విచారణ అనంతరం కమిషన్ తుది నివేదికను ఈ నెలాఖరులోగానో, జూలై మొదటి వారంలోనో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశముంది.