NEET Exam: నేడు నీట్ ఎగ్జామ్.. రాష్ట్రంలో 190 కేంద్రాల్లో పరీక్ష
NEET Exam: ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం చేపట్టే జాతీయ అర్హత ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని నిర్వహిస్తోంది. గత ఏడాది నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఈసారి పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో నీట్ 24 పట్టణాల్లో 190 కేంద్రాల్లో జరగనుంది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 62 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 72,507 మంది రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి రాష్ట్రంలో నీట్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల లోపు విద్యార్థులందరూ కేంద్రంలోకి చేరుకోవాలి. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. గడియారాలు, బూట్లు, ఇతర గాడ్జెట్లు, నిషేధిత పదార్ధాలను తీసుకెళ్లకూడదు. గత ఏడాది రాష్ట్రంలో నీట్ దరఖాస్తులు 79,813 రాగా..ఈ సారి 7,306 తగ్గాయి.