ఇందూరులో అర్వింద్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ వ్యూహమేంటి?

Update: 2019-09-27 10:27 GMT

ఆ జిల్లాను కమలం పార్టీ టార్గెట్ చేసిందా ఆపరేషన్ ఆకర్ష్‌ను పకడ్బందీగా అమలు చేస్తోందా లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుని ఊపుమీదున్న కమలదళం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తోందా ఇందుకు ఆ పార్టీ నేతలు ఏ నేతలపై గురి పెట్టారు అసలు కమలం పార్టీ ఇందూరును, ఎందుకు లక్ష్యంగా పెట్టుకుంది ధర్మపురి అర్వింద్‌ ఆపరేషన్‌ ఆకర్ష్ స్కెచ్చేంటి?

నిజామాబాద్ జిల్లాలో కమలం పార్టీ అంతంత మాత్రంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన దాదాపు 9 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కొల్పోయింది. ఐతే పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా ధర్మపురి అర్వింద్ ఘన విజయం సాధించారు. పార్టీలో చేరిన 22 నెలల్లోనే ఆయన ఎంపీ అయ్యారు. పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎమ్మెల్యేల బలం లేకున్నా బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ కవితపై 70వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు ధర్మపురి అర్వింద్. లోక్ సభ ఎన్నికల స్పూర్తితో జిల్లాలోను పార్టీని పటిష్టం చేసేందుకు ఎంపీ అర్వింద్ స్కెచ్ వేశారట. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలను కమలం గూటికి చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ లో బలమైన నేతలు, టీడీపీ నేతలపై గురి పెట్టారట. టీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టచ్ లోకి వెళ్లి చర్చిస్తుండటం, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఎంపీ అర్వింద్ ఇంటికెళ్లి చర్చలు జరపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అనంతరం అదంతా ఉట్టిదే అంటూ కొట్టి పారేసినా, మరికొద్ది మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, షకీల్ బాటలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

నిజామాబాద్ లో 9 నియోజకవర్గాలు ఉండగా నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ లో బీజేపీ కొద్దిగా బలం పెంచుకుంది. అక్కడి నియోజకవర్గ ఇంచార్జీలు సైతం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకురాలు ఏలేటి అన్నపూర్ణ, ఆమె కుమారుడు మల్లిఖార్జున్ రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు ఎంపీ అర్వింద్ వాళ్లతో చర్చలు జరిపారట. త్వరలో అన్నపూర్ణ, తన కుమారుడితో కలిసి పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. డి. శ్రీనివాస్ సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారట. ఈపాటికే ఆయన అనుచరులు అర్వింద్ సమక్షంలో బీజేపీ తీర్దం పుచ్చుకున్నారు. త్వరలో ఆయన కూడా కమలం కండువా కప్పుకుంటారనే టాక్ నడుస్తోంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్ లాంటి బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే కాంగ్రెస్ లో బలమైన నేతలు ఒకరిద్దరూ కూడా ఎన్నికల సమయం నాటికి బీజేపీ కండువా కప్పుకుంటారని, నేతలు అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా నియోజకవర్గంలో బలమైన నేతలకు బీజేపీ నేతలు గాలం వేస్తున్నారట. తమ పార్టీ నాయకుడు ఎంపీగా ఉండటంతో రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు ఇప్పటి నుంచే ఇందూరుపై కమలం పార్టీ నేతలు దృష్టిపెట్టారట.

రాబోయే మున్సిపల్ ఎన్నికలు కమలం పార్టీకి అగ్ని పరీక్షలా మారాయి. ఆ లోపే బలమైన నేతలను చేర్చుకుని అధికార పార్టీకి సవాలు విసిరేందుకు సిద్దమవుతున్నా అధికార పార్టీ ఎత్తులకు బీజేపీ నేతలు పై ఎత్తులు ఎలా వేస్తారో వేచి చూడాలి. ఆపరేషన్ ఆకర్ష్ ను వికర్ష్ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు సైతం పావులు కదుపుతుండటంతో, ఇందూరు రాజకీయం రంజుగా మారింది.

Full View

Tags:    

Similar News