Mother Dairy: దివాళా దిశగా దూసుకెళుతున్న మదర్‌ డైరీ

Mother Dairy: వేలాది మంది పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్న మదర్‌ డైరీ

Update: 2022-06-01 04:55 GMT

దివాళా దిశగా దూసుకెళుతున్న మదర్‌ డైరీ

Mother Dairy: నల్గొండ. రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి దారుల పరస్పర సహకార సంఘం దీనినే నార్ముల్ అని మదర్ డెయిరీ అని పిలుస్తారు. వేల మంది రైతులు గత ముప్పై ఏళ్లుగా మదర్ డెయిరీ ని నమ్ముకుని పాడి పరిశ్రమ పై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. కానీ మదర్ డెయిరీ సంస్థ కు సొంత సంస్థ లో ఉన్నతాధికారుల నిర్ణయాలకు తోడు పాలకవర్గంలో డైరెక్టర్ల రాజకీయంతో దివాళా దిశగా సాగుతుంది. మూడు లక్షల లీటర్ల పాల సేకరణ నుంచి లక్షన్నర లీటర్లకు పడిపోయింది.. రైతులు పోసే పాలకు డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితి దాపురించింది.

నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఏ గ్రామంలో చూసిన పాడి రైతులు ఆవులు, గేదెల పోషణపై ఆధారపడి నార్ముల్ మదర్ డెయిరీకి పాలు పోసేవారు. డైరీ పాల సేకరణ ద్వారా పాడిరైతులకు ప్రత్యక్ష ఉపాధి కల్పించింది. లాభాలను కూడా రైతులకు పంచి పెట్టింది. అయినా ఈరోజు పాడిరైతులకు డబ్బు చెల్లించలేని దుస్తితికి చేరింది. గతప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించినట్లుగా లీటర్‌కు అదనంగా 4రూపాయల చొప్పున ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇదంతా గతం, లాభాలు పంచిన సంస్థ ఇపుడు పాడి రైతులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది... కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకు పోయింది. ప్రతి నెల జీతాలు, పాడి రైతులకు పాల బిల్లుల కోసం ఐదు కోట్ల రూపాయల అప్పు చేయాల్సి వస్తోంది. కొత్తగా ఎన్నికైన ఛైర్మన్‌ మదర్‌ డైరీ ఆస్తులను అమ్మి బకాయిలు చెల్లిస్తామంటే నమ్మారు.. ఇక్కడే అసలు తిరకాసు మొదలయ్యింది. రైతులకు చెల్లిస్తామన్న 4రూపాయల అదనపు డబ్బులో ఒక రూపాయి తగ్గించడంతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు రైతులు.

మదర్ డెయిరీ నష్టాలకు ప్రధాన కారణం డైరెక్టర్లేనని సిబ్బంది, పాడి రైతులు ఓపెన్ గానే డిస్కస్ చేస్తున్నారు. పాల శీతలీకరణ కేంద్రాలలో పాలు బయటకు అమ్ముకోవడం, అందులో నీళ్లు కలపడం అలా వచ్చే సొమ్ము ను కింది స్థాయి సిబ్బంది నుంచి ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు, డైరెక్టర్లు పంచుకోవడం జరుగుతోంది. డైరెక్టర్ల‌ మితిమీరిన రాజకీయం తోనే సంస్థ దివాళా దశకు చేరిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పాడిరైతులకు పెంచిన ధరలు చెల్లిస్తున్నామని పాలక వర్గం చెప్తున్నా అవి ఎవరి అకౌంట్లోకి వెళుతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

ప్రతి పదిహేను రోజులకు ఓకసారి పాల బిల్లు ఇవ్వాల్సిన సంస్థ నెల ,నెలన్నర రోజులకు బిల్లులు చెల్లిస్తోంది. ఇక సిబ్బంది జీతాలకు అదే ఇబ్బంది... దీంతో అందినకాడికి అప్పులు తేవడం తో పాటు సంస్థ కు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను అమ్మేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం మదర్ డెయిరీని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని పాడి రైతులు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News