TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత

TS EAMCET 2023: అగ్రికల్చర్‌, ఫార్మాలో అర్హత సాధించిన 91,935 మంది విద్యార్థులు

Update: 2023-05-25 04:46 GMT

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. పరీక్షరాసినవారిలో ఇంజినీరింగ్‌లో 80 శాతం, అగ్రికల్చర్‌లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి(ఉన్నత విద్య) కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సైతం పాల్గొన్నారు. సాక్షి ఎడ్యుకేషన్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్‌ పరీక్షలో 79 శాతం అబ్బాయిలు, 85 శాతం అమ్మాయిలు క్వాలిఫై అయినట్లు తెలిపారామె. అనిరుధ్‌ అనే విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్‌ దక్కినట్లు ప్రకటించారు. అగ్రికల్చర్‌ పరీక్షలో 84 శాతం అబ్బాయిలు, 87 శాతం అమ్మాయిలు అర్హత సాధించారని తెలిపారు మంత్రి సబిత. అగ్రికల్చర్‌ మెడిసిన్‌(AM) ఫార్మా కేటగిరీ టాప్‌ 5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే కావడం గమనార్హం.

ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్, ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాల ర్యాంకుల‌ను, మార్కుల‌ను విడుద‌ల చేశారు. ఎంసెట్‌ పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మే 10, 11వ తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే జరిగాయి.

ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్‌ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ఉండే అవకాశం ఉంది. ఇక, స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం రిజర్వ్‌ చేయగా, 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు.

Tags:    

Similar News