Cyber crime: ఒక్క ఈమెయిల్‌తో మేఘా కృష్ణారెడ్డి కంపెనీనే బోల్తా కొట్టించి రూ. 5.5 కోట్లు కాజేశారు

Megha Krishna Reddy's MEIL company cheated by cyber fraudsters: మేఘా కృష్ణారెడ్డికి చెందిన ఈ కంపెనీకి నెదర్లాండ్స్‌లో డుయికర్ కంబషన్ ఇంజనీర్స్ అనే డచ్ కంపెనీతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ డచ్ కంపెనీకి మేఘా కంపెనీ వర్క్ ఆర్డర్స్, పర్చేస్ ఆర్డర్స్ ఇస్తోంది.

Update: 2025-02-15 16:00 GMT

Cyber crime: మేఘా కృష్ణారెడ్డి కంపెనీనే బోల్తా కొట్టించి రూ. 5.5 కోట్లు కాజేసిన సైబర్ క్రిమినల్స్

MEIL company cheated by cyber fraudsters: సైబర్ మోసగాళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి పెద్ద పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు నిర్మించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) కంపెనీనే బోల్తా కొట్టించారు. ఒక తప్పుడు మెయిల్ ఐడిని సృష్టించి ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా రూ. 5.5 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేఘా కృష్ణారెడ్డికి చెందిన ఈ కంపెనీకి నెదర్లాండ్స్‌లో డుయికర్ కంబషన్ ఇంజనీర్స్ అనే డచ్ కంపెనీతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ డచ్ కంపెనీకి మేఘా కంపెనీ వర్క్ ఆర్డర్స్, పర్చేస్ ఆర్డర్స్ ఇస్తోంది. గతంలో ఆ డచ్ కంపెనీ ఇచ్చిన ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్ (ABN Amro Bank) ఎకౌంట్లోకి మేఘా కంపెనీ యాజమాన్యం పేమెంట్స్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నట్లుగా ఆ కంపెనీ నుండి పీటర్ నుయిజిస్ అనే కంపెనీ ప్రతినిధి రిప్లై ఇచ్చే వారు.

అయితే, ఈ రెండు కంపెనీల మధ్య వ్యాపార లావాదేవీలను పసిగట్టిన సైబర్ క్రిమినల్స్ డచ్ కంపెనీ పేరుతో ఒక ఫేడ్ ఈమెయిల్ ఐడి సృష్టించారు. అసలు కంపెనీ ప్రతినిధి ఈమెయిల్ ఐడి nuijs@duiker.com కాగా సైబర్ క్రిమినల్స్ అచ్చం అదే ఐడీని తలపించేలా nuijs@duiker.cam అనే ఐడిని తయారు చేశారు.

గతేడాది నవంబర్ 29 నాడు సదరు డచ్ కంపెనీ పేరుతోనే మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఒక ఈమెయిల్ పంపించారు. కోర్టు కేసుల కారణంగా తమ రెగ్యులర్ బ్యాంక్ ఖాతా సమస్యల్లో ఉన్నందున ఇకపై పేమెంట్స్ అమెరికాలోని జేపీ మోర్గాన్ బ్యాంకుకి చెందిన మరో ఖాతాకు పంపివ్వాల్సిందిగా చెబుతూ ఆ డీటేల్స్ ఇచ్చారు.

అది ఫేక్ ఈమెయిల్ ఐడి నుండి వచ్చిందనే విషయం గమనించని మేఘా కంపెనీ సిబ్బంది అది నిజమని నమ్మేశారు. ఈ ఏడాది జనవరి 24న €3,18,000 (భారతీయ కరెన్సీలో 2.87 కోట్లు), జనవరి 29న €2,89,800 (భారతీయ కరెన్సీలో 2.6 కోట్లు) మనీ ట్రాన్స్‌ఫర్ చేశారు.

ఎప్పటిలానే ఈ సారి కూడా డచ్ కంపెనీకి డబ్బులు ముట్టినట్లుగా నిర్ధారించుకునే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే తమకు డబ్బులు అందలేదని ఫిబ్రవరి 4, అలాగే 5వ తేదీన డచ్ కంపెనీ మెయిల్ పంపించింది. డచ్ కంపెనీ మెయిల్ చూసి షాక్ అయిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మరోసారి పేమెంట్స్, మెయిల్ కమ్యునికేషన్ రివ్యూ చేసుకుంది. అప్పుడు తెలిసింది సైబర్ క్రిమినల్స్ ఫేక్ మెయిల్ ఐడితో తమను బోల్తా కొట్టించారని.

ఫిబ్రవరి 13 కంపెనీ ప్రతినిధులు తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరోకు ఫిర్యాదు చేసి జరిగిన విషయం చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ సామాన్యులను మాత్రమే కాదు... పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలను కూడా ఇలా చీట్ చేస్తున్నారని ఈ ఘటనతో మరోసారి ప్రూవ్ అయింది. 

WATCH THIS VIDEO - Digital Arrest అంటే ఏంటి? అలా చేసి కోట్లు ఎలా కొట్టేస్తున్నారు?| Trendig స్టోరీ

Full View

Tags:    

Similar News