Crime News: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో ఆయన్ను నరికి చంపేశారు. ఈయనపై గతంలో భూతగాదాల విషయమై పలు కేసులు నమోదు అయ్యాయి. హత్యకు పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెళ్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత సరళను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు.
బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తున్న సమయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో నలుగురు వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయన్ను చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో నరికారు. తలకు బలమైన గాయంతోపాటు కత్తిపోట్ల కారణంగా పేగులు బయటకు వచ్చాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కాగా రాజలింగమూర్తి రెండు దశాబ్దాలుగా వరంగల్ కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా భూ సమస్యలను పరిష్కరించేవారు. గతంలో రాజలింగమూర్తిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని సింగరేణిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ఆయన ఫిర్యాదు చేశారు. తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి భార్య సరళ, కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి బైఠాయించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు.