హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌లో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజూకూ చలి తీవ్రత పెరుగుతోంది.

Update: 2020-01-02 05:09 GMT

 హైదరాబాద్‌లో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజూకూ చలి తీవ్రత పెరుగుతోంది. దీనికి తోడు పగటి పూడ కూడా వాతావరణం చల్లగా మారిపోయి.. వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో మరోసారి వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఓ వైపు చలి, మరో వైపు వర్షంతో హైదరాబాద్ వాసులు వణుకుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లిన వారు చల్లటి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతోనే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండ్రోజులుగా చినుకులు పడుతున్నాయి. బుధవారం సాయంత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవడంతో గ్రేటర్‌ తడిసిముద్దయింది. ఉప్పల్‌, నాచారం, నారాయణగూడ, అంబర్‌పేట, నాంపల్లి, అబిడ్స్‌, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మరో రెండ్రోజులపాటు గ్రేటర్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఏపీ, తెలంగాణలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 8 గంటలు దాటాక కూడా పొగమంచు వీడటంలేదు. విశాఖ, ఆదిలాబాద్‌ జిల్లాల వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడం, దీనికి శీతలగాలులు కూడా తోడవడంతో చలి తీవ్రత అధికమయింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా బుధవారం వాతావరణం మరింత చల్లబడింది. చలికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.   

Tags:    

Similar News