KTR: రంగంలోకి తారక రాముడు.. టికెట్ దక్కని అసంతృప్తులకు బుజ్జగింపులు
KTR: ఒక్కో నియోజకవర్గంలో విభేదాలను పరిష్కరిస్తున్న కేటీఆర్
KTR: రంగంలోకి తారక రాముడు.. టికెట్ దక్కని అసంతృప్తులకు బుజ్జగింపులు
KTR: తారక రాముడు రంగంలోకి దిగాడు. టికెట్ దక్కని అసంతృప్తులను శాంతింపజేస్తూ ఏకతాటి పైకి తీసుకువస్తున్నాడు. బీఆర్ఎస్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులను.. సిట్ రైట్ చేస్తున్నాడు. తండ్రి అప్పగించిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేస్తూ.. తన తారకమంత్రం పవర్ ఏంటో మరోసారి రుజువు చేస్తున్నాడు. ఆయనే యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్. టాక్క్ ఏదైనా, ఎంతంటి అసాధారణమైనది అయినా అప్పగించిన పనిని పూర్తి చేయడమే కేటీఆర్ లక్ష్యం.
అసెంబ్లీ ఎన్నికల కోసం ఫస్ట్ లిస్ట్‌లోనే 115స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు గులాబీ బాస్ కేసీఆర్. అందులో ఏడుగురుకి తప్ప.. మిగతా సిట్టింగ్ ఎమ్యెల్యేలందరికీ మళ్లీ టికెట్ కన్ఫామ్ చేశారు. దీంతో టికెట్ దక్కని కొంతమంది సిట్టింగ్‌లతో పాటు, టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థికి సహకరించేది లేదని నిరసన గళాలు వినిపించారు. ఇలా అసంతృప్తులతో కొన్ని నియోజవకర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ గాడి తప్పిందనే ప్రచారాలు కూడా వినిపించాయి. దీంతో నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు కేసీఆర్. ఇంకేముందు కేసీఆర్ ఆజ్ఞతో రంగంలోకి దిగారు కేటీఆర్. నియోజకవర్గాల్లో వర్గ విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్త లీడర్లతో పాటు ఆశావహులు, ఇతర లీడర్లను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ముందుగా స్టేషన్ ఘన్‌పూర్‌పై ఫోకస్ పెట్టి...టాస్క్‌ను పూర్తి చేశారు.
స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియం శ్రీహరికి ప్రకటించారు కేసీఆర్. టికెట్ దక్కకపోవడంతో..తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు రాజయ్య. నా ప్రయాణం కేసీఆర్‌తోనే అంటూనే..తన నిరసనను వ్యక్తం చేశారు రాజయ్య. ఎవరో వచ్చి కుప్ప మీద కూర్చుంటానంటే ఊరుకుంటానా అని ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అని చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహయ్యను కలవడంతో.. కాంగ్రెస్‌లోకి పోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.
కానీ మంత్రి కేటీఆర్ ఎంట్రీతో.. మొత్తం సీనే మారిపోయింది. ఉప్పు నిప్పులా ఉండే.. రాజయ్య, కడియం మధ్య దోస్తీ కుదుర్చారు కేటీఆర్. కడియం, రాజయ్యను ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న కేటీఆర్.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడి యం శ్రీహరి గెలుపునకు కృషి చేయాలని, సముచిత స్థానం కల్పిస్తామని రాజయ్యకు హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రాజయ్య.. పార్టీ గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు. రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్‌గా అవకాశమిస్తారని సమాచారం.
సోమ, మంగళవారం నాటికి జనగామ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులను కేటీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జనగామ టికెట్ తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడు, నాలుగు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని.. నియోజకవర్గానికి వెళ్లి పని చేసుకోవాలని ఆయనకు కేసీఆర్ సూచించారు. అనంతరం పల్లాతోనూ కేసీఆర్ సమావేశమై నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. జనగామ టికెట్ పల్లాకు దాదాపు ఖరారైందని, ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారని సమాచారం. పల్లాకు సహకరించేందుకు.. ముత్తిరెడ్డిని కేటీఆర్ ఒప్పించినట్టు తెలుస్తోంది.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కేటీఆర్ చొరవతోనే ఇద్దరు కేసీఆర్‌ను కలిసినట్టు తెలుస్తోంది. పార్టీని గెలిపించాలని ఇద్దరు నేతలకు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. మంత్రి కేటీఆర్ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదుర్చినట్టు సమాచారం. అసంతృప్తి ఉన్న ఒక్కో నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. టికెట్ దక్కని ఆశావహులకు.. భవిష్యత్తులో పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందనే హామీ ఇస్తూ..నేతల మధ్య సమన్వయం కుదుర్చుతున్నారు కేటీఆర్. నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య వివాదాలను ఎలా సద్దుమణించగనున్నారనే వార్తలు వస్తున్నాయి.ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నాయో అన్నింటిని పరిష్కరిస్తారా..?