నిధుల గురించి కేంద్రం వద్దకు రావొద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ నగరంలోని జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో సర్వీసు రెండో కారిడార్ ను ఈ నెల 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.

Update: 2020-02-15 10:22 GMT

హైదరాబాద్ నగరంలోని జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో సర్వీసు రెండో కారిడార్ ను ఈ నెల 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ప్రొటోకాల్ ప్రకారం ఈ ప్రారంభోత్సవానికి సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించాల్సి ఉండగా వారిని విస్మరించారు. దీంతో ఈ విషయం పై తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఎల్ అండ్ టీ మెట్రో అధికారులతో ఈ రోజు దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌లో కిషన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్‌ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ ఎంపీ నాయుడు, ఎల్‌టీఎంఆర్‌హెల్‌ఎల్ ఏకే షైనీ, హెచ్‌ఎంఎల్‌ఆర్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఆనంద్ మోహన్, జీఎం రాజేశ్వర్ ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై మెట్రో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయనతో పాటు బీజేపీ నేతలు కూడా ప్రోటోకాల్ ప్రకారం తమను ఆహ్వానించలేదని మండిపడుతున్నారు. మెట్రో నిర్మాణంలో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని ఆయన తెలిపారు. కేంద్రం సహకారం లేనిదే మెట్రో ప్రాజెక్టు నిర్మించారా అని అధికారులను నిలదీశారు. 'మెట్రో రైలు ప్రారంభం అనేది ఎల్ అండ్ టీకి ఇంటి పనో, వ్యక్తిగత వ్యవహారమో కాదు కదా.. పిలవకుండా ఎలా చేస్తారు' అని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగొద్దని ఆయన స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ సంస్థకు ఇక భవనాలు, అనుమతులు ఏవీ ఇవ్వమని హెచ్చరించారు.

అంతే కాక ఇంకా కేంద్రం ఇవ్వాల్సిన రూ.250 కోట్ల నిధుల గురించి ఇక ఢిల్లీకి రావొద్దని ఎల్అండ్ టీ అధికారులను హెచ్చరించారు. సమీక్ష అనంతరం మంత్రి కిషన్ రెడ్డి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. ఆయనతో పాటు తెలంగాణ బీజేపీకి చెందిన పలువురు నేతలు మెట్రో రైల్లో ప్రయాణించారు. ఇక పోతే ఇటీవల ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన జేబీఎస్ - ఎంజీబీఎస్ రెండో మెట్రో కారిడార్ తో హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద రెండో మెట్రోగా ఆవిర్భవించింది. ఈ మార్గం జేబీఎస్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లతో 11 కిలో మీటర్ల దూరం ఉంది.  

Tags:    

Similar News