Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం స్కీముపై కీలక అప్డేట్..ఊహించని షాక్ ఇచ్చిన సర్కార్..!
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం స్కీముపై కీలక అప్డేట్..ఊహించని షాక్ ఇచ్చిన సర్కార్..!
Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం స్కీము అమలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. జూన్ 2 నుంచి రుణ మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభమవుతుందని ముందుగా ప్రకటించినా..ఇప్పుడు అది ముందుగా ఊహించిన ప్రకారం జరగకపోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లపథకం, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సన్నద్ధతతో పాటు రాజీవ్ యువ వికాసం స్కీముపైనా కూడా ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ స్కీముకు అంచనాలకు మించిన దరఖాస్తులు రావడంతో అనర్హులకూ ప్రయోజనాలు చేరే అవకాశం ఉందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. నిజమైన లబ్దిదారులకే స్కీం బెనిఫిట్స్ అందాలని వారు స్పష్టం చేశారు. ఒక్క అనర్హుడికైనా ప్రయోజనం కలిగితే స్కీమ్ లక్ష్యం వంకరవుతుందనే ఆందోళనను వారు ముఖ్యమంత్రికి వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరింత లోతైన పరిశీలన అవసరమని..స్పష్టత కోసం రానున్న మంత్రివర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించాలని మంత్రులు సూచించారు.
జూన్ 5వ తేదీన జరగనున్న తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో ఈ స్కీము అమలు కీలకంగా నిలవనుంది. ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం స్కీముతోపాటు మరికొన్ని ముఖ్యమైన పాలనాపరమైన నిర్ణయాలపై సుదీర్ఘ చర్చ కూడా జరగనుంది. మంత్రులు ఇటీవల తమ జిల్లాల్లో చేసిన పర్యటనల్లో నాలుగు కీలక అంశాలపై అధికారులతో సమీక్షలు జరిపి..వాటి నివేదికలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షంలో సమర్పించారు. ఈ నివేదికల ఆధారంగా నేటి సమావేశంలో చర్చ జరిగింది.
రాజీవ్ యువ వికాసం మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు వంటి పలు అంశాలపై జిల్లా వారీగా సమర్పించిన నివేదికలపై సమీక్షించారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీ నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎంకు అందించారు. ఆ వివరాలపై మంత్రులకు సమగ్రంగా వివరించారు. ఈ నివేదిక ఆధారంగా మంత్రివర్గంలో చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ధాన్యం, కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు.